సాధారణంగా నవధాన్యాలను నవగ్రహాలకు సంకేతంగా భావిస్తారు. నవగ్రహ పూజా సమయంలో తప్పనిసరిగా ఈ నవధాన్యాలను ఉపయోగించి శాంతి పూజలు నిర్వహిస్తుంటారు. ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని సంకేతంగా చెబుతుంటారు. ఆదివారం గోధుమలు సమర్పిస్తారు. సోమవారం చంద్రుడికి బియ్యం, మంగళవారం కుజగ్రహానికి కందులు, బుధవారం బుధ గ్రహానికి పెసలు, గురువారం గురు గ్రహానికి శనగలు, శుక్రవారం శుక్రుడినికి బొబ్బర్లు, శనివారం శని గ్రహానికి నువ్వులను సమర్పిస్తారు. అదేవిధంగా రాహు గృహానికి మినుములు, కేతు గ్రహానికి ఉలవలు ప్రధాన ధాన్యాలు గా ఉంటాయి.

ఈ నవధాన్యాలను గ్రహ దోష నివారణకు ఉపయోగించి పూజలు చేస్తుంటారు. అదేవిధంగా శుభకార్యాలలో కూడా నవధాన్యాలకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తారు. ముఖ్యంగా వివాహ వేడుకలో నవధాన్యాలను మట్టి మూకూళ్ళలో పోసి పూజలు నిర్వహిస్తారు. అందులో ఉన్న నవధాన్యాలు మొలకలు బాగా వస్తే ఆ దంపతుల వివాహ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందని భావిస్తారు. అంతేకాకుండా వారిపై నవగ్రహాలు అనుగ్రహం ఉంటుందని భావిస్తారు.
ఈ విధంగా నూతన వధూవరులు ఇద్దరూ నవగ్రహాల అనుగ్రహంతో పాటు వారికి ప్రాముఖ్యత కలిగిన నవధాన్యాల అనుగ్రహాన్ని పొందుతారు. ఇక ఆరోగ్యపరంగా కూడా నవధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. జీవితంలో అన్ని రకాల మనస్తత్వాలను సమన్వయం పరచుకోవాలనే ఉద్దేశాన్ని నవధాన్యాలు తెలుపుతాయి. అందువల్ల శుభకార్యాలలో నవధాన్యాలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు.































