గత కొన్ని సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వరదల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ నగరవాసులు వర్షాల వల్ల ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.
ఈ వరదల వల్ల చాలామంది విద్యార్థుల సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి. దీంతో పలువురు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. సర్టిఫికెట్లు లేకపోతే తమ చదువు వృథా అవుతుందని అబిప్రాయపడుతున్నారు. అయితే తెలంగాణ విద్యాశాఖ విద్యార్థులకు సర్టిఫికెట్ల విషయంలో అనవసర భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థుల నుంచి విద్యాశాఖకు ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయి.
తెలంగాణ విద్యాశాఖ ఈ ఫిర్యాదుల గురించి స్పందిస్తూ దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి కొత్త సర్టిఫికెట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది. విద్యార్థులు తమ సర్టిఫికెట్ల విషయంలో ఆందోళనకు గురి కావాల్సిన అవసరమే లేదని ఆమె నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది. ఇప్పటికీ నగరంలో ముంపులోనే ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి.
నిన్న హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం కురిసింది. ఇలాంటి సమయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన హామీతో విద్యార్థులలో టెన్షన్ తగ్గింది. మరోవైపు మరికొన్ని రోజుల్లో మరో అల్ప పీడనం వల్ల తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విద్యాశాఖ చెబుతుండటం గమనార్హం.