దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎక్కడ, ఎప్పుడు, ఎవరి నుంచి సోకుతుందో తెలియని ఈ వైరస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ప్రాణాంతక కరోనా వైరస్ పేరు వింటేనే ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది. కరోనా టెన్షన్ తో ప్రజలు వస్తువులను ముట్టుకోవాలన్నా టెన్షన్ పడుతున్నారు. లిఫ్ట్ బటన్స్, మెట్ల రెయిలింగ్ ముట్టుంటే కరోనా సోకుతుందెమోనని భయభ్రాంతులకు గురవుతున్నారు.
కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లలో ఉపరితలాలపై కూడా వైరస్ జీవించే అవకాశం ఉందని.. ఉపరితలాలను ముట్టుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని లేదంటే వాటిని ముట్టుకున్న తరువాత శానిటైజర్ తో చేతులకు శుభ్రం చేసుకోవాలని శాస్త్రవేత్తలు కీలక సూచనలు చేశారు. గంటల పాటు వస్తువులపై వైరస్ ఉంటుందని తెలియడంతో కొందరు ఆ వస్తువులను కుడా శానిటైజర్ తో శుభ్రం చేయసాగారు.
మరి కొందరు వార్తాపత్రికల ద్వారా కరోనా సోకుతుందని పత్రికలను వేయించుకోవడమే మానేశారు. ఉపరితలాల నుంచి కరోనా సోకుతుందని ఆఖరికి కూరగాయలను కూడా శానిటైజ్ చేసిన వాళ్లు ఉన్నారు. అమెరికాకు చెందిన ప్రొఫెసర్ గాంధీ మాత్రం ఉపరితలాల నుంచి కరోనా సోకుతుందనడం వట్టి అపోహ మాత్రమేనని వెల్లడించారు. అమెరికా సైన్స్ వెబ్‌సైట్ ‘నాటిలస్’ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉపరితలాలను కరోనా రోగులను తాకినప్పటికీ ఆ ఉపరితలాల నుంచి ఇతరులకు వైరస్ సోకే అవకాశాలు ఒక శాతం కంటే తక్కువని పేర్కొన్నారు. అయితే ఈ అపోహ ప్రజలకు మంచే చేసిందని.. చాలామందికి చేతులను క్రమంగా శుభ్రం చేసుకునే అలవాటును నేర్పించిందని.. కరోనా సోకకుండా ఉండాలంటే భౌతిక దూరం అతి ముఖ్యమైనదని వెల్లడించారు. ‘లాన్‌సెట్’ జర్నల్ కు ఆయన తన పరిశోధనలకు సంబంధించిన సమాచారం ఇచ్చారు.