DCP Sri Sai : అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన పాశవిక హత్య కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. బిటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్ అనే యువకుడిని అతని ఇంటర్ ఫ్రెండ్ హరిహర కృష్ణ దారుణంగా చంపాడు. ఆవేశంలో చేసిన హత్య అయ్యుంటే కేవలం అతడిని చంపి ఉండాలి కానీ చాలా పగతో మూడు నెలల ముందే ప్లాన్ చేసుకుని మరీ హరిహర కృష్ణ నవీన్ ను చంపేశాడు. ఇంటర్మీడియట్ నుండి మంచి మిత్రులుగా ఉన్న నవీన్, హరిహర మధ్య గొడవకు కారణం నిహారిక రెడ్డి అనే అమ్మాయి ప్రేమ అని తెలుస్తోంది. తొలుత నవీన్, నిహారిక ప్రేమించుకున్నా వేర్వేరు కారణాలతో నవీన్ ఆ అమ్మాయికి దూరంగా ఉంటున్నాడు. ఇక నవీన్ తో విడిపోయాక హరిహర ప్రేమకు ఓకే చెప్పిన నిహారికకు నవీన్ మళ్ళీ దగ్గరవ్వుతున్నాడనే కోపంతో హరిహర నవీన్ ను అత్యంత దారుణంగా చంపేశాడు. ఇక ఈ కేసు గురించి ఎల్బి నగర్ డిసిపి శ్రీసాయి మాట్లాడారు.

మూడు నెలల ప్లాన్ తో చంపాడు…
ఎల్బి నగర్ డిసీపీ శ్రీసాయి మాట్లాడుతూ హరిహర నవీన్ ను తానే చంపినట్లు నిజం ఒప్పుకుని లొంగిపోయాడని తెలిపారు. అయితే ఈ కేసులో మిగిలిన వివరాలు తెలియాలని, నిహారిక ప్రమేయం ఎంత ఉందనేది తెలియదంటూ చెప్పారు. అనవసరంగా ఒక అమ్మాయిని ఇందులో లాగకపోవడం మంచిదని, వాట్సాప్ లో నిహారికకు గుండె, పెదాలు ఫోటోలు పెట్టాడు అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఇక ఆ అమ్మాయి కూడా షాక్ లో ఉందని, తనకు కౌన్సిలింగ్ ఇస్తున్నారని, తన ఇద్దరు మిత్రులలో ఒకరు చనిపోవడం అలాగే మరొకరు జైలుకి వెళ్లడం వంటివి షాక్ కి గురిచేశాయని తెలిపారు.

చదువుకుంటున్న పిల్లలు ఇలాంటి తప్పుడు మార్గంలోకి వెళ్లడం బాధాకరం అని, తల్లిదండ్రులు పిల్లలలను గమనిస్తుండాలని సూచించారు. హరిహర నవీన్ చంపడానికి ఎవరెవరు సహాయం చేసారు, తాను ఒక్కడే ఎలా హత్య చేసాడు అనేవి ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన నవీన్ ఎస్టి అవ్వడం వల్ల కేసు దర్యాప్తు నెలలోపు పూర్తి చేయాలనే నిబంధన ఉంటుందని ఆ మేరకు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు తెలిపారు.






























