భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే ఒక ఆచారం. పాశ్చాత్య దేశాల్లో “హాయ్”, “హలో” వంటి పలకరింపులు సాధారణం అయితే, మన సంప్రదాయంలో రెండు చేతులు జోడించి “నమస్కారం” చెప్పడం ప్రత్యేకతగా నిలుస్తుంది. ఇది కేవలం శరీర భాష మాత్రమే కాకుండా, మనసులోని వినమ్రతను వ్యక్తపరచే విధానం అని భావిస్తారు.

“నమస్కారం” అనే పదానికి కూడా లోతైన అర్థం ఉంది. “నమ” అంటే వినమ్రంగా వంగడం, “స్కారం” అంటే ఆచరణ. అంటే ఎదుటివారిని గౌరవిస్తూ మన అహంకారాన్ని తగ్గించి వంగి పలకరించడం. ఈ పద్ధతి వేల ఏళ్లుగా భారతీయ సంస్కృతిలో కొనసాగుతూ వస్తోంది. మనం ఎదురుపడిన వ్యక్తిని గౌరవించడానికి, మంచి భావనతో ఆహ్వానించడానికి ఇది ఒక చిహ్నంగా పరిగణించబడుతోంది.
నమస్కారం చేసే విధానం కూడా అందరికీ ఒకేలా ఉండదు. ఎదుటివారి స్థాయి, సంబంధం, సందర్భాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. దేవాలయంలో దేవతల ముందు నిలబడ్డప్పుడు చేతులను తలపైకి ఎత్తి నమస్కరించడం సంప్రదాయం. పెద్దలు లేదా గౌరవనీయుల ముందు నిలిచినప్పుడు చేతులను నుదిటి దగ్గర జోడించి నమస్కరించడం మర్యాదగా భావిస్తారు. స్నేహితులు, సాటి వారిని కలిసినప్పుడు హృదయస్థానంలో చేతులు జోడించి నమస్కరించడం సాధారణంగా కనిపిస్తుంది.
తల్లిదండ్రులు, గురువులు, దైవం వంటి అత్యంత గౌరవనీయుల ముందు సాష్టాంగ నమస్కారం చేయడం సంప్రదాయంలో ప్రత్యేక స్థానం పొందింది. దీనిని దండ ప్రణామం అని కూడా అంటారు. ఈ విధానంలో శరీరంలోని అష్టాంగాలు భూమిని తాకేలా పూర్తిగా వంగి నమస్కరిస్తారు. ఇది సంపూర్ణ వినయాన్ని సూచించే ఆచారం. మహిళలు సాధారణంగా పంచాంగ నమస్కారం చేస్తారు, అంటే ఐదు భాగాలతో నమస్కరించడం.
నమస్కారం చేసే ఈ విధానం కేవలం ఆచారం మాత్రమే కాదు.. మనసులో ఉన్న గౌరవాన్ని వ్యక్తపరచే సాంస్కృతిక చిహ్నం. శారీరకంగా దూరం పాటిస్తూ కూడా భావాలను వ్యక్తపరచగలిగే ఈ పద్ధతి, ఆరోగ్య పరంగానూ ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కరోనా కాలం తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా “నమస్తే” అనే పలకరింపు గుర్తింపు పొందింది.
మొత్తానికి, నమస్కారం అనేది మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న ఒక గొప్ప ఆచారం. ఇది మనలో వినయం పెంచడమే కాకుండా, సంబంధాలను మరింత బలపరుస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవనశైలులు మారుతున్నా, ఇలాంటి సంప్రదాయాలను కొనసాగించడం మన సంస్కృతిని నిలబెట్టే కీలక అంశంగా భావించాలి.






























