నాగార్జున హీరోగా,మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గీతాంజలి సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ పాత్రలో గిరిజ నటించారు.ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ అయినా రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుంది.

గీతాంజలి అద్భుతమైన విజయం అందుకోవడంతో గిరిజ ఆ తరువాత మోహన్ లాల్ తో కలిసి రెండు సినిమాలు చేశారు.’వందనం’, ‘ధనుష్కోడి’లో నటించారు. అయితే ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధనుష్కోడి’ చిత్రం పలు కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. అదేవిధంగా అమీర్ ఖాన్ సరసన ‘జో జీతా వోహి సికిందర్’ సినిమాలో కొన్ని సన్నివేశాలలో నటించినప్పటికీ ఆ తర్వాత ఈమె స్థానంలో మరో హీరోయిన్ వచ్చారు.

ఈమెకు గీతాంజలి సినిమా అద్భుతమైన అవకాశాలను తెచ్చిపెట్టింది. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని అన్నింటినీ తిరస్కరిస్తూ తెలుగులో హృదయాంజలి అనే సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఓ సందర్భంలో సినిమా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం ఏంటని ప్రశ్నించగా అందుకు ఆమె తమదైన శైలిలో సమాధానం తెలియజేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

నాకు స్టార్ హీరోలు దర్శకనిర్మాతలు ముఖ్యం కాదు కథ ముఖ్యం. నా వద్దకు వచ్చిన ప్రొడ్యూసర్లు అందరూ ఈ హీరోకి కాల్షీట్లు ఇవ్వండి ఈ సినిమాకు మీ రెమ్యూనరేషన్ ఇంత, అడ్వాన్స్ తీసుకోండి అని చెప్పారే తప్ప.. ఎవరూ కూడా కథ ఇదని వివరించలేదు. నటిగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడం కోసం సినిమాల్లో నటించాలనుకున్నాను కానీ డబ్బు కోసం ఒక ఆట బొమ్మలా సినిమాలో నటించడం అంటే నాకు నచ్చలేదు.అందుకోసమే పెద్ద పెద్ద నిర్మాతలు తన దగ్గరికి వచ్చినప్పటికీ వారిని ఎంతో సున్నితంగా తిరస్కరించాను. ఈ క్రమంలోనే తన అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు వస్తే తప్పకుండా సినిమాలలో నటిస్తానని వెల్లడించి అలా గిరిజ ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పవచ్చు.


































