హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దీపావళి పండుగ ఒకటి. ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలలలో దీపవళి పండుగ వస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ నూతన వస్త్రాలు ధరించి, పూజలు చేసి, బాణసంచా కాల్చి సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఏపీలోని ఒక గ్రామంలోని ప్రజలు మాత్రం దీపావళి పండుగను జరుపుకోరు. ఆ గ్రామానికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున దీపావళి పండుగను చేసుకున్నా శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలి మండలంలోని పున్నవపాలెం గ్రామంలో మాత్రం ఒక్క దీపం కూడా వెలగదు.

దీపావళి పండుగను జరుపుకోకూడదనే ఆచారం అనాదిగా ఆ గ్రామంలో కొనసాగుతోంది. దాదాపు 200 సంవత్సరాలుగా ఈ గ్రామంలోని ప్రజలు దీపావళి పండుగకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీపావళి పండుగ రోజున ఆ గ్రామంలో దీపాలు వెలగకపోవడంతో పాటు బాణసంచా కూడా పేలదు. ఆ గ్రామ ప్రజలు దీపావళి పండుగను జరుపుకోకపోవడానికి ప్రత్యేకమైన కారణాలే ఉన్నాయి. దీపావళి పండుగ రోజున ఆ గ్రామంలో ఒక పాప, రెండు ఎద్దులు 200 సంవత్సరాల క్రితం మరణించాయి.

దీపావళి పండుగ రోజున ఆ విధంగా జరగడంతో గ్రామస్థులు ఈ ఘటనను అపచారంగా భావించారు. అప్పటినుంచి ఆ గ్రామంలో దీపావళి పండుగను జరుపుకోవడం లేదు. నాగులచవితి పండుగ సమయంలో సైతం గ్రామంలో ఇదే విధంగా జరగడంతో గ్రామస్తులు ఆ పండుగను కూడా నిషేధించారు. అయితే గ్రామస్తులు మాత్రం పండుగ జరుపుకుంటే బాగుంటుందని దీపావళి గురించి అభిప్రాయపడుతున్నారు.

200 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న ఘటనల వల్ల పండగలను పూర్తిగా నిషేధించటం సరికాదని అభిప్రాయపడుతున్నారు. అయితే గ్రామ పెద్దలు మాత్రం కట్టుబాట్లు మార్చబోమని అలా మార్చితే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here