Radisson Pub: శనివారం అర్థరాత్రి బంజారా హిల్స్ లో రాడిసన్ హోటల్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై పోలీసులు దాడి చేసిన ఘటనలో ఎంతో మంది సినీ ప్రముఖుల పిల్లలు, వ్యాపారవేత్త పిల్లలు, జూనియర్ ఆర్టిస్టులు అరెస్టయ్యారు. ఈ ఘటనకు సంబంధించి దాదాపు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలోనే తమపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు అంటూ కొందరు సినీ ఆర్టిస్టులు సోషల్ మీడియా వేదికగా వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న కల్లపు కుషితా ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో కుషితా మాట్లాడుతూ… లేట్ అవర్స్ పబ్ లో ఉండటం మా తప్పు కాదు.. పబ్ లో ఉన్నంత మాత్రాన మేము డ్రగ్స్ తీసుకున్నామని మాపై నిందలు వేయడం సరికాదు.

లేట్ నైట్ పబ్ నిర్వహిస్తున్న నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. పార్టీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్దాము అనే లోపు పోలీసులు వచ్చి దాడి చేశారని, పబ్ లో ఎక్కువమంది ఉండడం నిజమేనని ఈమె వెల్లడించారు. నిజంగా అక్కడ డ్రగ్స్ ఉపయోగిస్తున్నారనే విషయం మాకు తెలియదు. తెలిస్తే మేము అక్కడికి వెళ్లే వాళ్ళము కాదని, ఇప్పుడిప్పుడే మేము ఇండస్ట్రీలోకి వచ్చాము, మా జీవితాలతో ఆడుకోవద్దని,మా జీవితాలను నాశనం చేయొద్దని ఈమె సెల్ఫీ వీడియో ద్వారా మీడియాను కోరారు.
మీడియా సహనం పాటించాలి…
మేము పబ్ లో ఉన్నాము అంతే కానీ ఎలాంటి డ్రగ్స్ ఉపయోగించలేదని కావాల్సి వస్తేఎప్పుడైనా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని కుషితా వెల్లడించారు.అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో అలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని, అలాంటి వారికి మేము కూడా సహకరిస్తామని ఇలాంటి దుష్ప్రచారాలు వల్ల మా తల్లిదండ్రులు మానసికంగా ఎంతో ఇబ్బంది పడతారని ఈమె తెలియచేశారు. దయచేసి మీడియా వాళ్ళు సహనం పాటించాలని మమ్మల్ని బద్నాం చేయకండి అంటూ వేడుకున్నారు.


































