ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండేది కాదు. అయినా కూడా వేసవిలో నీళ్లు చల్లగా ఉంచుకోవడం, ఆహార పదార్థాలు తాజాగా నిల్వ చేయడం కోసం మన పెద్దలు సహజ పద్ధతులను ఉపయోగించేవారు. అలాంటి పాతకాల నేచురల్ కూలింగ్ టెక్నిక్‌లలో “సొరకాయ బుర్ర” ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ పద్ధతి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొందరు ఈ సొరకాయ బుర్రను ఉపయోగిస్తున్నారు. పెద్దగా పెరిగిన గుండ్రని సొరకాయను పూర్తిగా ఎండబెట్టి, లోపల ఉన్న గుజ్జును తొలగిస్తే ఖాళీ పాత్రలా మారుతుంది. అదే “సొరకాయ బుర్ర”. ఇది సహజంగా చల్లదనాన్ని నిల్వ ఉంచే గుణం కలిగి ఉండటంతో పూర్వంలో ప్రజలు దీనిని నీళ్లు నిల్వ చేసేందుకు ఎక్కువగా వాడేవారు.
ఈ బుర్రలో పోసిన నీరు మట్టికుండలో ఉంచినట్టే క్రమంగా చల్లబడుతుంది. ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండానే గంటల తరబడి నీరు చల్లగా ఉండటం దీని ప్రత్యేకత. ముఖ్యంగా వేసవి కాలంలో రైతులు, కూలీలు పొలాలకు వెళ్లేటప్పుడు ఈ సొరకాయ బుర్రలోనే మంచినీళ్లు తీసుకెళ్లేవారని పెద్దలు గుర్తుచేస్తున్నారు. కొందరు మజ్జిగ, గంజి వంటి పదార్థాలను కూడా ఇందులో నిల్వ చేసుకునేవారని చెబుతున్నారు.
ఆరోగ్య పరంగా కూడా ఈ పద్ధతి మంచిదేనని గ్రామీణ ప్రాంతాల ప్రజలు భావిస్తున్నారు. ఫ్రిజ్‌లో అతిగా చల్లబడిన నీళ్లతో పోలిస్తే సహజంగా చల్లబడిన నీళ్లు శరీరానికి అనుకూలంగా ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా గొంతు ఇబ్బందులు, జలుబు వంటి సమస్యలు తగ్గేందుకు ఇవి సహాయపడతాయని విశ్వసిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి స్పష్టమైన వైద్య ఆధారాలు మాత్రం లేవని నిపుణులు చెబుతున్నారు.
ప్లాస్టిక్ వాడకం పెరిగిన ఈ కాలంలో ప్రకృతికి హాని చేయని ఇలాంటి పాత పద్ధతులపై మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారయ్యే ఈ నేచురల్ కూలింగ్ టెక్నిక్ పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆధునిక ఫ్రిడ్జ్‌ల మధ్య కూడా పాతకాల తెలివితేటలు ఇప్పటికీ ప్రత్యేక ఆకర్షణగానే నిలుస్తున్నాయి.



























