Alludugaru Movie: టాలీవుడ్‌లో కలెక్షన్ కింగ్‌గా పాపులారిటీ సంపాదించుకున్న నటుడు మంచు మోహన్ బాబు. గురువు గారు దర్శకరత్న దాసరి నారాయణ రావు అండదండలతో చిన్న వేశాలతో సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన మోహన్ బాబు అగ్ర కథానాయకుడిగా, నిర్మాతగా ఇప్పటికీ ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే అది ఎంతటిదైనా చేసేయాల్సిందే. కాదు కూడదు అనేది ఆ తర్వాత మోహన్ బాబు నోటి నుంచి వచ్చేది కాదు. అది ఇప్పటికీ మారలేదు. హీరోగా మాత్రమే నటించాలని ఏనాడు అనుకోలేదు మోహన్ బాబు. మనసుకు నచ్చిన పాత్ర ఏది ఇచ్చినా చేయడానికి సిద్దంగా ఉండేవారు. అది విలన్ పాత్రైనా, కామెడీ పాత్రైనా, కౄరంగా ఉండే పాత్రైనా సరే సై అనేవారు.

అయితే ఒకానొక సమయంలో మోహన్ బాబు వరుస ప్లాప్ లను ఎదుర్కొన్నారు. దాంతో మోహన్ బాబు ఇక సినిమాలు మానేస్తే మంచిదేమో అని మాట్లాడుకున్నారు. ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్న మోహన్ బాబు తనతో సినిమా చేయమని దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావును అడిగారు. ఆ తరువాత వరుస ప్లాపులతో రాఘవేంద్ర రావు కెరీర్ కాస్త డౌన్ అయింది. ఈ క్రమంలో అయన కెరీర్ నిలేబెట్టుకునే ప్రయత్నంలో మెగాస్టార్ చిరంజీవితో ‘జగదీకవీరుడు అతిలోక సుందరి’ సినిమా చేస్తున్నారు. అందువల్ల ఆ సినిమా పూర్తయ్యే వరకు వెయిట్ చేయమని రాఘవేంద్ర రావు చెప్పడంతో.. మరో డైరెక్టర్ తో ఈ సినిమా చేద్దామని అనుకున్నారు మోహన్ బాబు.. కానీ మోహన్ బాబు వరుస ప్లాపులలో ఉండటంతో ఆయనతో సినిమా చేయడానికి మరో డైరెక్టర్ ముందుకు రాలేదు.. దీనితో ‘జగదీకవీరుడు అతిలోక సుందరి’ సినిమా రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత రమ్య కృష్ణ, మోహన్ బాబు జంటగా ‘అల్లుడుగారు’ చిత్రాన్ని ప్రకటించారు కే.రాఘవేంద్ర రావు. మోహన్ బాబు సొంతంగా తన బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించిన తర్వాత కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని ఎంతోమంది భావించి ఈ సినిమాని ఆపేయాలని దర్శకుడికి సలహా కూడా ఇచ్చారు. కానీ రాఘవేంద్రరావు ఎంతో కసితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పట్లో ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమా తర్వాత మోహన్ బాబు వెనుతిరిగి చూసుకోలేదు.

మలయాళ రీమేక్ చిత్రం…
ఇలా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అల్లుడుగారు సినిమా మలయాళ రీమేక్ చిత్రం అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ సినిమా 1988లో మలయాళంలో ‘చిత్రం’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ఇందులో మోహన్ లాల్ రంజని ప్రధాన పాత్రలలో నటించారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 300 రోజులు ప్రదర్శితమైన మోహన్ లాల్ సినీ కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది. ఈ చిత్రం రిమేక్ హక్కులను హీరొయిన్ సుహాషిని మేనేజర్ తీసుకుని నందమూరి బాలకృష్ణతో ఈ సినిమా చేయాలని భావించారు. అయితే బాలకృష్ణ కు ఈ సినిమా కథ నచ్చకపోవడంతో అయన వద్దనుకున్నారు. దాని తరువాత ఈ సినిమా రైట్స్ మోహన్ బాబు చేతుల్లోకి వెళ్ళాయి. ఇలా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాని తెలుగులో అల్లుడుగారు చిత్రంగా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. అందుకే మోహన్ బాబు ఇండస్ట్రీలో దర్శకరత్న దాసరి, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావును తన గురువులుగా భావిస్తారు.
































