చాలామంది రోజుకు రెండు సార్లు బ్రష్ చేస్తున్నప్పటికీ దంత సమస్యలు మాత్రం తగ్గడం లేదు. పళ్ల పసుపుదనం, దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం రావడం, సెన్సిటివిటీ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బ్రష్ చేయకపోవడం కాదు.. సరైన విధంగా బ్రష్ చేయకపోవడమేనని దంత వైద్య నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది బ్రష్‌ను బలంగా రుద్దితేనే పళ్లు శుభ్రపడతాయని భావిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల పళ్లపై ఉండే రక్షణ పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గట్టిగా బ్రష్ చేయడం వల్ల చిగుళ్లు బలహీనపడటంతో పాటు పళ్ల సున్నితత్వం కూడా పెరుగుతుంది. అందుకే మృదువైన బ్రష్‌ను ఉపయోగిస్తూ నెమ్మదిగా శుభ్రం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
బ్రషింగ్ చేసే సమయం కూడా ఎంతో ముఖ్యం. కొందరు కేవలం 20 లేదా 30 సెకన్లలోనే బ్రషింగ్ పూర్తి చేస్తుంటారు. అయితే కనీసం రెండు నిమిషాల పాటు పళ్లన్నింటినీ సమంగా శుభ్రం చేయాలని నిపుణులు చెబుతున్నారు. పై పళ్లు, కింది పళ్లు, వెనుక భాగం, నాలుక ఇలా ప్రతి భాగాన్ని శుభ్రం చేయడం అవసరం.
ఆహారం తిన్న వెంటనే బ్రష్ చేయడం కూడా మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పుల్లటి పదార్థాలు లేదా కూల్‌డ్రింక్స్ తీసుకున్న వెంటనే బ్రష్ చేస్తే పళ్ల ఎమామెల్ బలహీనపడే అవకాశం ఉంటుంది. కనీసం 30 నిమిషాల తర్వాత బ్రష్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.
చాలామంది బ్రష్‌ను నెలల తరబడి మార్చకుండా వాడుతుంటారు. కానీ ఒకే బ్రష్‌ను ఎక్కువకాలం ఉపయోగిస్తే దానిపై బ్యాక్టీరియా పేరుకునే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా మూడు నెలలకు ఒకసారి బ్రష్ మార్చడం ఉత్తమమని దంత నిపుణులు చెబుతున్నారు.
పళ్ల మధ్య చిక్కుకున్న ఆహారాన్ని తొలగించేందుకు ఫ్లాస్ ఉపయోగించడం కూడా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. కేవలం బ్రష్‌తో మాత్రమే పూర్తిగా శుభ్రం చేయడం సాధ్యం కాదు. అలాగే నాలుకను కూడా ప్రతిరోజూ శుభ్రం చేయడం వల్ల నోటిదుర్వాసన తగ్గుతుంది.
రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయడం చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ రాత్రిపూట నోటిలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. అందుకే నిద్రకు ముందు తప్పనిసరిగా బ్రష్ చేయడం ద్వారా దంత సమస్యలను తగ్గించుకోవచ్చు.
పళ్ల ఆరోగ్యం కేవలం అందానికే కాదు.. మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో పెద్ద దంత సమస్యలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే సరైన బ్రషింగ్ అలవాట్లు పాటించడం ఎంతో అవసరం.































