ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ నేడు అమ్మఒడి పథకాన్ని అమలు చేయాల్సి ఉండగా ఈ పథకంతో పాటు ప్రభుత్వ పథకాల అమలుకు బ్రేక్ పడింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి వీలు లేదంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం నుంచి ఈ మేరకు ఉత్తర్వులు అందాయి. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం వల్ల నేడు ఖాతాల్లో జమ కావాల్సిన అమ్మఒడి నగదు ఆలస్యంగా జమ కానుంది. మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా నిలిచిపోనుంది. జగన్ సర్కార్ గత నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతోంది.

ఎన్నికల సంఘం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతూ పథకాల అమలుకు బ్రేక్ వేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టులో జగన్ సర్కార్ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ గురించి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here