చిరంజీవి-కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో న్యాయం కావాలి,కిరాయి రౌడీలు శివుడు శివుడు శివుడు,ప్రేమ పిచ్చోళ్ళు.. చిత్రాల అనంతరం నెల్లూరుకు చెందిన ప్రముఖ డాక్టర్ తిరుపతిరెడ్డి తమ వాస్తవ్యుడైన దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డిని కలవడం జరిగింది. వీరిద్దరు కలిసి ఒక సినిమాను రూపొందించాలనుకున్నారు. యాక్షన్ చిత్రాల కథా రచయిత “వియత్నం వీడు సుందరం” ఎన్నో రకాలైన కథలను దర్శకనిర్మాతలకు వినిపించారు. కానీ అవేవి వారికి నచ్చలేదు. చిరంజీవి గారు అంతకుముందే దర్శక, నిర్మాతలకు 1983 జూన్ 15 నుంచి డేట్స్ ఇవ్వడం జరిగింది.

జూన్ 8వ తేదీ వరకు కూడా కథ ఫైనలైజ్ కాలేదు. అప్పుడు నిర్మాతలు తిరుపతిరెడ్డి, ధనుంజయ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నరసారెడ్డి పరుచూరి బ్రదర్స్ ని కలవడం జరిగింది. జూన్ 10వ తేదీన తిరుపతిరెడ్డి తను చూసిన “ఫస్ట్ బ్లడ్” అనే ఆంగ్ల చిత్రం సీడీని పరుచూరి బ్రదర్స్ కి చూపించి దీన్ని ఆధారంగా చేసుకొని ఒక కథ రాయండని చెప్పడం జరిగింది. జూన్ 15 కు కేవలం ఐదంటే ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. మద్రాసులో నివాసం ఉంటున్న ప్రముఖ నటుడు నూతన్ ప్రసాద్ మేడపై గదిలో రాత్రింబవళ్ళు కష్టపడి పరుచూరి బ్రదర్స్ ఒక కథ సిద్ధం చేశారు. అలా వారు రాసిన కథే ఖైదీ చిత్రం..

1982 డిసెంబర్ లో సిల్వెస్టర్ స్టాలోన్ చిత్రం “ఫస్ట్ బ్లడ్” విడుదలయింది. చిత్ర ప్రారంభంలో రాంబో (స్టాలోన్) ఒక చిన్న పట్టణం పొలిమేరలో బ్రిడ్జిపై వస్తూంటాడు. అతన్ని సందేహంగా చూసిన ఆ పట్టణ షరీఫ్ వివరాలు అడుగుతాడు. తర్వాత వెనక్కి వచ్చి అతన్ని అనుమానాస్పదంగా సోదా చేస్తే పదునైన కత్తి దొరుకుతుంది. అది ఎందుకని అడిగితే ‘రాంబో ‘అడవిలో వేటాడడం కోసం అని చెబుతాడు. షరీఫ్ అతనిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళతాడు. అక్కడ పోలీసులు అతనితో అమానుషంగా వ్యవహరిస్తారు. రేజర్ బ్లేడ్ తో రాంబో ను సమీపిస్తున్న పోలీస్ ను చూసి గతంలో ‘వియత్నాం’ యుద్ధం సంఘటనను గుర్తు చేసుకుని రాంబో తిరగబడతాడు.

అతను గతంలో వియత్నాం యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు ఆ యుద్ధం పూర్తి అయిన తర్వాత అతనికి సరిగ్గా గుర్తింపు రాదు. రాంబో తన స్నేహితుడు గురించి విచారించగా చనిపోయాడని అతని భార్య ద్వారా తెలుసుకుంటాడు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఖైదీ చిత్రంలో కొద్ది మార్పులతో కనిపిస్తాయి. మిగతా చిత్రంలో కథానాయకుని ఆహార్యం, శారీరక భాష, ఖైదీ చిత్రం అడవిలో చిరంజీవి చేసిన సాహసాలు, సంఘటనలు ఆంగ్ల చిత్రం ఫస్ట్ బ్లడ్ ను పోలి ఉంటాయి.. 1983 అక్టోబర్ 28న విడుదలైన ఈ ఖైదీ సినిమా యాక్షన్ చిత్రాలకు ఎర్రతివాచీ పరిచింది. ఇంకా చెప్పాలంటే చిరంజీవి సినీ చరిత్రలో ఒక మైలు రాయిగా మిగిలిపోయింది.