గుంటూరు, సెప్టెంబర్ 5, 2025: గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో గత మూడు నెలల్లో 30 మంది మరణించిన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఒకే లక్షణాలతో ఇన్ని మరణాలు సంభవించడం తనను షాక్‌కు గురిచేసిందని, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 15 కుటుంబాలను పరామర్శించామని తెలిపారు. ప్రాథమిక పరిశీలనలో కలుషిత తాగునీటి సమస్య వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు తేలిందని, ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా పరిశీలించాలని ఆయన సూచించారు.

కలుషిత నీటి సమస్య
అంబటి రాంబాబు మాట్లాడుతూ, సంజీవయ్య గుంట ప్రాంతంలో నీరు నిల్వ ఉండటం వల్ల కలుషితమై, ఆ నీటిని ట్యాంక్‌లోకి ఎక్కించినట్లు తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదని, వైసీపీ బృందం వెళ్తుందని తెలిసిన తర్వాతే స్థానిక ఎమ్మెల్యే గ్రామాన్ని సందర్శించారని ఆరోపించారు. గ్రామంలో తాగునీరు దొరకడం లేదని, కానీ మద్యం మాత్రం విచ్చలవిడిగా లభిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారని, “బెల్ట్ షాపులను ఎత్తేస్తానని చెప్పిన చంద్రబాబు మాటలు ఏమయ్యాయి?” అని అంబటి ప్రశ్నించారు.
ప్రభుత్వంపై విమర్శలు
మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని అంబటి ఆరోపించారు. చంద్రబాబు తన తాబేదారులకు ఆస్తులను దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, తనపై అవినీతి ఆరోపణలతో కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయని విమర్శించారు. “ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే బ్యాచ్ మీరు. నా మీద విజిలెన్స్ విచారణ, అక్రమ కేసులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. మహా అయితే అరెస్టు చేస్తారు, అంతే!” అని అంబటి సవాల్ విసిరారు. నారా లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులకు తాను లేదా తన ఇంట్లో కుక్క కూడా భయపడదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
కోర్టుల్లో తేల్చుకుంటామని సవాల్
ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో కూడా తనపై విచారణ జరుగుతోందని, మరో అక్రమ కేసు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంబటి ఆరోపించారు. “ఇలాంటి విషయాలను కోర్టుల్లో తేల్చుకుంటాం. లోకేష్ బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు,” అని ఆయన స్పష్టం చేశారు. తురకపాలెం గ్రామంలో తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించి, మరణాలకు కారణాలను గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.





























