హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో నాలుగు రోజుల క్రితం దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసు సంచలనంగా మారుతోంది. చిన్నారి హత్య కేసులో సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆ రాక్షసుడిని వెంటనే ఉరి తీయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అభం శుభం తెలియని ఆరు సంవత్సరాల చిన్నారిపై ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టి.. ఆ చిన్నారిని ఎత్తుకు వెళ్లి ఆత్యాచారం చేసి హత్య చేశాడు.

ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని అతడి ఇంట్లోనే చాపలో చుట్టి అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ రోజు నుంచి అతడు పరారీలో ఉన్నాడు. ఘటన జరిగిన సమయంలోనే తమకు న్యాయం చేయాలి అంటూ తల్లిదండ్రులు.. బంధువులు ఆందోళనకు దిగారు. దీనిపై ఆందోళనకు ఎక్కువ కావడంతో.. పోలీసులు నిందితుడిని కఠినంగా శిక్షిస్తామంటూ హామీ ఇవ్వడంతో ఘటన జరగిన సమయంలో వాళ్లు కాస్త శాంతించారు. కానీ ఇంతవరకు అతడిపై చర్యలు తీసుకోలేదు.
చిన్న చిన్న విషయాలను మీడియాలో బూతద్దం పెట్టి చూపించే ఈ మీడియా ఇలాంటి ఘటనలపై ఎందుకు తీవ్రంగా స్పందించరని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. అతడు సినిమాల్లో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో.. సామాజిక అంశాలలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటారు. బాధిత తల్లిదండ్రులను పరామర్శించడానికి వెళ్లిన మంచు మనోజ్ ఆ తల్లిదండ్రులు తన కాళ్లమీద పడి ఏడుస్తుంటే.. తను ఏమీ చేయలేని ఓ అసమర్థుడిలా భావన కలిగింది అని మంచు మనోజ్ పేర్కొన్నారు.
అతడు మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. బాధిత కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అతడు ఎవరి కంట పడినా.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మీడియా ప్రతినిధులు కూడా వీళ్లకు న్యాయం చేసే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.



























