భారతదేశంలో అతిపెద్ద మీడియా సంస్థలలో ఒకటైన సన్ టీవీ నెట్‌వర్క్ ఇప్పుడు డీఎంకే కుటుంబ కలహాలతో వార్తల్లో నిలుస్తోంది. డీఎంకే నేత, మాజీ కేంద్రమంత్రి దయానిధి మారన్ తన సోదరుడు, సన్ నెట్‌వర్క్ ఛైర్మన్ కళానిధి మారన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ లీగల్ నోటీసులు పంపించారు. ఆయన్ని మోసం, మనీలాండరింగ్ వంటి ఆరోపణలతో నోటీసుల ద్వారా ప్రశ్నించారు.

దయానిధి మారన్ జూన్ 10న కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్‌తో పాటు మొత్తం 7 మందికి నోటీసులు జారీ చేశారు. చెన్నైకు చెందిన లా ధర్మ సంస్థ తరఫున న్యాయవాది కె. సురేశ్ వీటిని పంపారు. ఈ నోటీసులో దయానిధి కళానిధి తన తండ్రి ఆరోగ్యం బలహీనంగా ఉన్న సమయంలో కుటుంబ పరిస్థితులను ఆసరాగా చేసుకుని సన్ నెట్‌వర్క్‌లో తన వాటాను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.
దయానిధి ప్రకారం – 2003లో కళానిధి మారన్ తనకు 12 లక్షల షేర్లను కేవలం రూ.10 చొప్పున ఇచ్చారని, కానీ వాటి నిజమైన విలువ అప్పట్లోనే రూ. 2500–3000 వరకు ఉందని పేర్కొన్నారు. ఈ లావాదేవీలన్నీ నిబంధనలకు వ్యతిరేకంగా, బయటపరచకుండా, నకిలీ పద్ధతుల్లో జరిగాయని పేర్కొంటున్నారు.
ఇక అంతేగాక, దయానిధి మారన్ ఈ వ్యవహారంపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) ద్వారా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంతో మారన్ కుటుంబంలో పాత ఘర్షణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. గతంలో కూడా సన్ టీవీలో ఎంకే దయాళు వాటాను 100 కోట్లకు కొనుగోలు చేయడంపై వివాదం చెలరేగింది. అప్పుడూ కరుణానిధి తీరుపైనా ఆరోపణలు వచ్చాయి.
ప్రస్తుతం కళానిధి మారన్ దయానిధి నోటీసులపై ఏమైనా స్పందించారా అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే ఈ కేసు తమిళనాడు రాజకీయాల్లో మాత్రమే కాదు, మీడియా బిజినెస్ వర్గాల్లో కూడా పెద్ద దుమారాన్ని లేపే అవకాశముంది.































