Gongadi Trisha: గొంగడి త్రిష ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతున్న పేరు. క్రికెట్ రంగంలో రాణిస్తూ సంచలనాలను సృష్టిస్తున్న ఈ గొంగడి త్రిష పేరు ఇప్పుడు మారుమోగుతుంది. దీంతో ఈమె ఎవరు తన బ్యాగ్రౌండ్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జరిగిన అండర్ -19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను భారత్ వరుసగా రెండో సారి కైవసం చేసుకుంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.

భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో గొంగడి త్రిష మూడు వికెట్లు తీసింది. వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా, పరుణిక తలా రెండు వికెట్లు తీశారు. షబ్నమ్ ఓ వికెట్ పడగొట్టింది. అనంతరం గొంగడి త్రిష 44 నాటౌట్; 33 బంతుల్లో 8 కోట్లు కొట్టి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. దీంతో ఈమె పేరు మారుమోగుతుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈమె ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో జన్మించింది గొంగడి త్రిష. ఆమె తండ్రి రామిరెడ్డికి ఆటలంటే ఎంతో ఇష్టం. ఐటీసీలో ఫిట్‌నెస్ సలహాదారుడిగా పని చేశారు. ఇక చిన్నప్పటినుంచి త్రిషకు క్రికెట్ అంటే ఎంతో ఆసక్తి ఉంది అని గ్రహించిన తన తండ్రి రామిరెడ్డి తనని అదే దిశగా ప్రోత్సహించారు. క్రికెట్ అంటే తనకిష్టమని గ్రహించిన ఈయన తన సొంత గ్రామం వదిలి హైదరాబాద్ కి వచ్చి సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో ఏడేళ్ల త్రిషను చేర్చాడు.
ఇదే అకాడమీలో ప్రముఖ క్రికెట్ ప్లేయర్ మిథాలీ రాజ్ ను చూస్తూ పెరిగిన త్రిష కొన్ని సందర్భాలలో ఆమె సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ క్రికెట్లో బాగా రాణించింది. రోజుకు ఏడెనిమిది గంటల ప్రాక్టీస్ చేసేది. ఈ క్రమంలో 8 ఏళ్లకే అండర్-16, 12 ఏళ్లకే అండర్-19 టోర్నీల్లో ఆడింది. 13 ఏళ్లకే బీసీసీఐ ఛాలెంజర్స్ టోర్నీ బరిలో దిగింది. ఇలా ప్రతి ఒక్క మ్యాచ్ తన ఆటతీరును కనబరుస్తు విజయాలు అందుకుంటున్న త్రిష పట్టుదల చూస్తుంటే అతి త్వరలోనే భారత మహిళల సీనియర్ జట్టులోనే చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.































