రైతులకు ప్రభుత్వం ఇప్పటికే పలు రకాల పథకాలను ప్రవేశపెడుతూ.. వారికి భరోసాగా నిలుస్తోంది. పీఎం కిసాన్ తో పంటలకు పెట్టుబడి కింద సంవత్సరానికి రూ. 6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ ఆర్థిక సాయం రైతులకు ఎంతో మేలు చేకూర్చుతుంది. అయితే తాజాగా మోడీ సర్కారు మరో శుభవార్త చెప్పింది. అదేంటంటే.. రబీ పంటలకు కనీస మద్దతును పెంచుతూ.. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.

రబీ సీజన్‌లో పంటలు వేసే రైతులందరికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వేర్వేరు పంటలకు కనీసం రూ. 40 నుంచి రూ. 400 వరకు కనీస మద్దతు ధర పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్రమంత్రి మండలి బుధవారం సమావేశమైంది.
ఈ సందర్బంగా దేశంలో 2022-23 మార్కెటింగ్ సీజన్‌లో అధీకృత రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర ను పెంచే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఇందులో గోధుమలకు క్వింటాల్ కు 1,975 నుంచి 2015గా.. బార్లీకి 2021-22 లో రబీ మార్కెట్ సీజన్‌లో కనీస మద్దతు ధర రూ.1,600 ఉండగా.. తాజాగా దానిని రూ.1,635 గా ప్రకటించింది.
శనగలకు రూ.5,100 నుంచి 5,230 వరకు.. ఎర్ర పప్పు రూ.5,100 నుంచి రూ.5,500 గా ప్రకటించింది ప్రభుత్వం. ఆవాలకు రూ.4,650 నుంచి రూ.5,050 గా.. కుసుమలకు రూ.5,327 నుంచి సీజన్‌కు కనీస మద్దతు ధర రూ.5,441 గా ప్రకటించింది ప్రభుత్వం. రైతుల్లో ఇతర పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.




























