Tirumal Tirupati Devasthanam: ఆధ్యాత్మిక నగరం తిరుపతికి రోజురోజు భక్తుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో తిరుపతి నగరం వేగంగా విస్తరిస్తోంది.

దీంతో ఇటు భక్తులు, అటు నగరవాసుల పెరుగుతుండటం.. ఫలితంగా వాహనాల రాకపోకలు ఎక్కువ అవ్వడంతో తిరుపతి నగరాన్ని ట్రాఫిక్ సమస్యలు వేధిస్తున్నాయి. అయితే తాజాగా తిరుపతి వాసులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కల నెరవేరబోతోంది.

నగరంలోని ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. దీంతో పాటు భక్తులు కొండపైకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. టీటీడీ, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పోరేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ ఫ్లైఓవర్, గరుడ వారధి వారం, పది రోజుల్లో తిరుపతి వాసులకు అందుబాటులోకి రానుంది.
కరోనా కారణంగా ఆదాయం తగ్గడంతో..
ఫ్లై ఓవర్ నిర్మాణ ఖర్చులో టీటీడీ 67 శాతం భరించగా… తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధుల నుంచి 33 శాతం కేటాయిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఆదాయం తగ్గడంతో ఇప్పటి వరకు టీటీడీ రూ. 75 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ ప్రస్తుతం బస్టాండ్ నుంచి అలిపిరి వరకు గరుడ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. తర్వాత కడప మార్గం నుంచి తిరుపతి నగరంతో సంబంధం లేకుండా మరో కనెక్షన్ ను కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ఆఫ్కాన్ సంస్థ ప్రయత్నిస్తోంది.































