హైతీలో రిక్టార్ స్కేల్ పై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ పెను భూకంపం వల్ల ఇప్పటి వరకు 304 మంది మృత్యువాతపడ్డారు. 2010లో సంఘటన నుంచి కోలుకుంటున్న ఆ దేశంపై ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనాలు భయంతో పరుగులు తీశారు.
అత్యంత జనసాంద్రత కలిగిన రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్ నగరానికి 160 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైంది. ఈ భూకంప తీవ్రతతో భననాలు నేలమట్టమవగా పెద్ద ఎత్తున జనం మృత్యువాతపడ్డారు.

304 మంది చనిపోగా.. కొంతమందికి భారీగా తీవ్ర గాయాలకు గురయ్యారు. భూకంపం హైతీ నైరుతి ద్వీపకల్పంలోని పాఠశాలలు, నివాసాలకు నష్టం కలిగించింది. ఇప్పటి వరకు ఘటనలో 304 మంది మృతి చెందినట్లు ఆ దేశ పౌర సంరక్షణ సంస్థ తెలిపింది. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రకి తరలిస్తున్నారు. భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లోని ఆసుపత్రులు నిండిపోయాయి.
పెస్టెల్, కోరెయిల్లెస్, రోసాక్స్ మున్సిపాలిటీల్లో క్షతగాత్రులతో ఆస్పత్రి నిండినట్లు పౌర రక్షణ సంస్థ అధిపతి జెర్రీ చాండ్లర్ తెలిపారు. ప్రకృతి విపత్తు నేపథ్యంలో హైతీ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. కూలిన భవనాల్లో ఎవరైనా చిక్కుకున్నారేమో అని స్థానిక ప్రజలు వెతుకుతున్నారు. హైతీ భూకంప తర్వాత ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం తక్షణ సహాయం అందించేందుకు ఆదేశాలు ఇచ్చారు. భూకంపం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నష్టాన్ని అంచనా వేయడానికి, ప్రజలను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. హైతీ తీరం నుంచి మూడు మీటర్లు అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు అక్కడ వాతావరణ శాఖ అధికారులు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో జనం భయంతో నగరం విడిచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.






























