సినిమా పరిశ్రమలోకి వచ్చి ఒక్కసారి ఫేమ్ వస్తే చాలంటారు… అప్పుడే భవిష్యత్ కోసం ప్లానింగ్ మొదలవుతుంది. ఆస్తులు కొనడం, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చాలా సాధారణం. కానీ కొందరు మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. అలాంటి వారిలో తమిళ్, తెలుగు భాషల్లో తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సిద్దార్థ్ ఒకరు.

ఇప్పటివరకు 25 ఏళ్లకుపైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా అతను సొంతంగా ఒక ఇల్లు కూడా కొనుక్కోలేదు. ఇది ఆయన అభిమానులకే కాకుండా, మీడియా వర్గాలకూ నిజంగా ఆశ్చర్యమే. తాజాగా ‘3BHK’ అనే సినిమా ప్రమోషన్స్ సందర్భంగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో సిద్దార్థ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
“నేను ఇండస్ట్రీకి వచ్చి సుమారు 25 ఏళ్లు అయింది. నా జీవితం సగం సినిమాల్లోనే గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకూ నేను ఒక్క ప్రాపర్టీ కూడా కొనలేదు. నాకు ఇంటి అవసరం అనిపించలేదు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, బాధ్యతలు పెరిగాయి. అందుకే ఇటీవలే ఓ సొంత ఇల్లు కొనుకున్నాం. ఇది నేను, అదితి ఇద్దరం కలిసే కలగన్న డ్రీం హౌస్” అని తెలిపారు.
అయితే ఆయన వ్యాఖ్యలపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సిద్దార్థ్ ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, రంగ్‌దే బసంతి లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు. అలాంటిది ఇప్పటివరకు సొంత ఇల్లు లేకుండా ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అలాగే ఇటీవలే హీరోయిన్ అదితి రావు హైదరీతో వివాహం చేసుకున్న సిద్దార్థ్, ఇప్పుడు వారి జీవితంలో మరో ముఖ్యమైన మైలు రాయిని చేర్చుకున్నట్లు చెప్పొచ్చు. “నా పెరెంట్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు.. సిద్దూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, ఎప్పుడు ఇంటి తాళాలు తిరుగుతాయా అని. ఇప్పుడు వాళ్ల కోరిక తీరినట్టే” అని సంతోషంగా తెలిపారు.
3BHK సినిమా కథ కూడా ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తమ సొంతింటి కలను ఎలా నెరవేర్చుకుంటుందనే కథాంశంతో సాగుతుంది. ఇదే నేపథ్యంలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన సిద్దార్థ్ మాటలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటున్నాయి.
సినిమాల్లో స్టార్ అయినా కూడా ఆస్తులపై ఆశ లేకుండా జీవించిన సిద్దార్థ్ నిరాడంబరతకు ఇది నిదర్శనం. ఇప్పుడు కుటుంబ బాధ్యతలతో పాటు ఒక భవిష్యత్ ఆలోచనగా సొంత ఇల్లు కొన్న ఆయన నిర్ణయం అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది.






























