గత మూడేళ్లుగా పరారీలో ఉన్న నటి, మోడల్ మీరా మిథున్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచాలని చెన్నై న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు పోలీసులు ఆమెను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఈ నెల 11న కోర్టులో హాజరుపరచనున్నారు.

కేసు నేపథ్యం
2021లో, మీరా మిథున్ ఒక వీడియో ద్వారా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వివిధ దళిత సంఘాలు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్‌ను కూడా అరెస్ట్ చేశారు.
జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తర్వాత, వీరిద్దరూ కోర్టు విచారణలకు హాజరు కాలేదు. దీంతో 2022లో మీరా మిథున్‌పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలో ఉన్నారు.
లొకేషన్ ఎలా తెలిసింది?
మూడేళ్లుగా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు ఆమెను గుర్తించలేకపోయారు. అయితే, ఇటీవల ఆమె తల్లి మీరా మిథున్‌ను రక్షించాలని కోరుతూ ఢిల్లీలోని ఒక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ద్వారా ఆమె ఢిల్లీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మీరా మిథున్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమె తమిళ చిత్ర పరిశ్రమలోని స్టార్ నటులైన విశాల్, రజనీకాంత్, త్రిష, విజయ్‌లపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. బిగ్‌బాస్ షోలో పాల్గొన్నప్పుడు కూడా ఆమెపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న ఆమెను చెన్నైకి తరలించే ప్రక్రియలో పోలీసులు ఉన్నారు.






























