ప్రపంచ దేశాల ప్రజలను కరోనా భయం వీడటం లేదు. ప్రతిరోజూ అంచనాలకు అందని స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో చాలామంది దగ్గు, జలుబు లాంటి కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే చాలామందికి పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా నమ్మలేని పరిస్థితి నెలకొందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. కరోనా పరీక్షల ఫలితాలు పలు సందర్భాల్లో తప్పుగా వస్తున్నాయని చెబుతున్నారు.

చాలామందికి కరోనా సోకినా లక్షణాలు వెంటనే కనిపించవని అందువల్ల పరీక్షల ఫలితాలు తప్పుగా నమోదవుతున్నాయని.. నెగిటివ్ వచ్చినంత మాత్రాన ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో వైరస్ బారిన పడినా లేనట్లు చూపిస్తుందని.. అలాంటి సందర్భాల్లో కరోనా లక్షణాలు కనిపిస్తూ ఉంటే మళ్లీ టెస్ట్ చేయించుకోవాలని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు కరోనా పరీక్షల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
కరోనా సోకిన తరువాత నాలుగు రోజుల్లోపు పరీక్షలు నిర్వహిస్తే వైరస్ సోకినా పాజిటివ్ నిర్ధారణ కాదని చెబుతున్నారు. దాదాపు 67 శాతం కేసుల్లో ఇదే పరిస్థితి ఉందని తెలుపుతున్నారు. కరోనా లక్షణాలు కనిపించిన మూడు రోజుల తర్వాత కూడా నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే నెగిటివ్ వచ్చినా పాజిటివ్ గానే భావించి చికిత్స చేయించుకోవడం మంచిదని తెలుపుతున్నారు.
అయితే కొన్ని సందర్భాల్లో కరోనా సోకకపోయినా పాజిటివ్ నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉంటాయని ఇలాంటి సందర్భాల్లో సైతం అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. యాంటీజెన్ పరీక్షల్లో నెగిటివ్ వస్తే ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


































