మనలో చాలామంది మాంసం అంటే అమితంగా ఇష్టపడతారు. అయితే కొన్ని సందర్భాల్లో మనం తినే మాంసమే మనకు కొత్త ఆరోగ్య సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా వైద్యులు మాంసం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు పడక తప్పదని చెబుతున్నారు. తాజాగా ఒక వ్యక్తి భరించలేని తలనొప్పితో వైద్యుని సంప్రదించగా మొదట డాక్టర్ సాధారణ తలనొప్పి అని భావించి ట్యాబ్లెట్లు ఇచ్చాడు.

అయితే ఆ వ్యక్తికి తలనొప్పి తగ్గలేదు సరికదా అంతకంతకూ పెరిగింది. దీంతో ఆ వ్యక్తి చికిత్స కోసం మళ్లీ ఆస్పత్రికి వచ్చాడు. సమస్య ఏంటో అర్థం కాని వైద్యులు అతడి మెదడును స్కాన్ చేయగా అతని మెదడులో ఏకంగా 700 పురుగులు కనిపించాయి. అవి రిబ్బన్ తరహాలో పొడవుగా ఉండే పురుగులని వైద్యులు గుర్తించారు. అనంతరం వైద్యులు అనుమానంతో బాడీ స్కాన్ చేయగా అతని శరీరమంతటా అలాంటి పురుగులు దర్శనమిచ్చాయి.

చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ వాంగ్ జియాన్ రాంగ్ ఇలా శరీరంలో వందల సంఖ్యలో పురుగులు చేరే వ్యాధిని టైనియాసిస్ అని అంటారని.. ఆ పురుగులు ఎక్కువ కాలం శరీరంలో ఉంటే ఆ వ్యక్తి ప్రాణాలకే అపాయం కలుగుతుందని వెల్లడించారు. ఉడకని పంది మాంసం తినడం వల్ల అతని శరీరంలో భారీ సంఖ్యలో టేప్ వార్మ్ లు చేరాయని వెల్లడించారు.

చివరకు ఆ వ్యక్తి కండరాల్లో సైతం పురుగులను గుర్తించామని తెలిపారు. మాంసాన్ని సరిగ్గా ఉడికించక పోతే టేప్ వార్మ్ గుడ్లు బ్రతికే ఉంటాయని.. ఆ గుడ్లు రక్తం ద్వారా శరీరంలోని అవయవాల్లో చేరి ఆరోగ్యపరమైన సమస్యలను సృష్టిస్తాయని తెలిపారు. శరీరంలో టేప్ వార్మ్ గుడ్లు చేరితే తలనొప్పి, జ్వరాలు, ఇతర వ్యాధుల బారిన సైతం పడే అవకాశాలు ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here