సూపర్ మార్కెట్లు, షాపింగ్ సెంటర్లలో వినియోగదారుడి నుంచి క్యారీ బ్యాగుకు అదనపు రుసుం వసూలు చేయడం ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి సూపర్ మార్కెట్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది కన్జ్యూమర్ ఫోరం.

ఇటీవల హైదర్ గూడలోని డీమార్ట్ షాపింగ్ మాల్ ఓ వినియోగదారుడికి క్యారీ బ్యాగు కింద రూ. 3.50 వసూలు చేసింది. దీంతో సదరు వినియోగదారుడు తార్నాకకు చెందిన భగేల్కర్ ఆకాష్ కుమార్ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. ఈ కేసుపై వినియోగదారుల ఫోరం కీలక తీర్పును వెల్లడించింది.
వినియోగదారుల నుండి క్యారీ బ్యాగ్ కోసం 3 రూపాయల 50 పైసలు తిరిగి చెల్లించడం తో పాటు పరిహారంగా వెయ్యి రూపాయలు చెల్లించాలని.. అలాగే.. న్యాయ సేవాకేంద్రానికి మరో వెయ్యి రూపాయలు వినియోగదారునికి చెల్లించాలని హైదర్ గూడ డిమార్ట్ ను ఆదేశించింది కోర్టు. ఇప్పటి నుండి ఎలాంటి క్యారిబ్యాగ్ కు డబ్బులు వసూలు చేయద్దు అని వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
45 రోజుల్లో తీర్పు అమలు కాకపోతే చెల్లించాల్సిన మొత్తానికి 18 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని తెలిపింది వినియోగదారుల ఫోరమ్ న్యాయస్థానం. డీమార్టే కాకుండా నగరంలోని చాలా వ్యాపార సముదాయాలు సరుకులు కొన్న తర్వాత వాటికి అవసరమయ్యే క్యారీ బ్యాగులకు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు బ్యాన్ తరువాత నుంచి పలు షాపింగ్ మాల్స్ ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పుతో అయినా షాపింగ్ మాల్స్ ప్రవర్తనలో మార్పు వస్తుందో లేదో చూడాలి.































