హిందువులు జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగను మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు అనే విషయం మనకు తెలిసిందే. ఈ పండుగ మొదటి రోజు భోగి ,భోగి మంటల ద్వారా భోగి భాగ్యాలు లభించాలని ఆ భగవంతుని కోరుకుంటూ జరుపుకుంటారు.మకర సంక్రాంతి రోజున ఇంటి ముందు పెద్ద పెద్ద అందమైన ముగ్గులను వేసి గొబ్బెమ్మలను పెట్టి ఘనంగా ప్రత్యేక పూజలలో పాల్గొంటూ మకర సంక్రాంతిని జరుపుకుంటారు. అయితే చివరిగా కనుమ పండుగ. కనుమ పండుగను కూడా ఎంతో పవిత్రంగా భావించి పాడి పశువులకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు. మూడు రోజులపాటు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగలో కనుమ పండుగ విశిష్టత ఏమిటో తెలుసుకుందాం..

రైతులు పండించిన పంటలు ఈ పండుగకు ఇంటికి చేరుకుంటాయి. అందువల్ల ఈ పండుగను రైతుల పండుగ అని కూడా పిలుస్తారు. అందుకోసమే కనుమ రోజు ఉదయం పశువుల పాక శుభ్రంగా కడిగి పశువులకు స్నానం చేయించి ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తారు. అలాగే కొత్త ధాన్యాలతో చేసిన పొంగలిని కూడా మొదటగా పశువులకు నైవేద్యంగా సమర్పిస్తారు. రైతు పండించే పంటలో రైతుకు ఎంతో సహాయంగా ఉండటం వల్ల ఈ పండుగను పశువులకు ఎంతో ప్రాముఖ్యత కల్పిస్తారని చెప్పవచ్చు. ఈ కనుమ రోజు పశువులకు అలంకరించి పూజలు నిర్వహించిన తరువాత ఈరోజు పశువులతో ఎలాంటి పనులు చేయించరు.

ఈ కనుమ రోజు కుటుంబ సభ్యులు పితృదేవతలను గుర్తు చేసుకుంటూ వారికి నైవేద్యంగా మాంసాహారాన్ని సమర్పిస్తుంటారు. అదే విధంగా కుటుంబ సభ్యులు బంధువులు అందరూ ఈ పండుగకు ఒకచోట చేరుకోవడం వల్ల అందరూ కలిసి సరదా ఉండటం కోసం కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అని చెబుతారు. అంతే కాకుండా కనుమ నాడు కాకి కూడ కదలదని సామెత ఎంతో ప్రాచుర్యంలో ఉంది.కాబట్టి కనుమ రోజు మనకు నచ్చిన ఆహార పదార్థాలను తయారు చేసుకొని తిని ఇంట్లో సంతోషంగా గడపడమే, కానీ ఈ పండుగ రోజు ఎవరు కూడా ప్రయాణాలు చేయకూడదు. అంతేకాకుండా కనుమ రోజు మినుము తినాలని అనే విషయాన్ని కూడా చెబుతుంటారు. సంక్రాంతి పండుగ సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంవల్ల మన శరీరంలో వేడిని కల్పించడం కోసం మినుములు తినాలని సూచిస్తారు. వీటిని తినడం ద్వారా మన శరీరంలో వేడి పెరగటమే కాకుండా తక్షణ శక్తిని కల్పిస్తుంది. అంతేకాకుండా ఈ కనుమ రోజు కోడి పందాలు, ఎద్దుల బండి పందేలు జోరుగా సాగుతాయి. ఈ విధంగా కనుమను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు అని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here