పనిపై బైక్ తీసుకొని బయటకు వెళ్లిన మొదలు.. ఇంటికి సురక్షితంగా వస్తామా.. లేదా అనేది ఎవరికీ తెలియదు. ప్రమాదం ఎటునుంచి వస్తుందో ఎంతమాత్రం అంచనా వేయలేము. ఇలాంటిదే అనుకోని ప్రమాదం బారిన పడ్డారు ఓ దంపతులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర పూణేకు చెందిన వైద్యుడు జుబేర్ షేక్, అతడి భార్య కలిసి బైక్ పై ఖడ్డా మార్కెట్ ప్రాంతం నుంచి పనిపై మరో ప్రదేశానికి వెళ్తున్నారు.

అయితే ఆ ప్రాంతం అంతా ఇరుకుగా ఉంటుంది. అలా వెళ్తున్న క్రమంలో అతడికి ఎదురుగా గేదెలు కనిపించాయి. దీంతో అతడు పక్కకు బండిని ఆఫ్ చేసి చూస్తూ ఉన్నాడు. అవి దగ్గరకు వచ్చి అకస్మాత్తుగా అతడిపై కొమ్ములతో దాడి చేశాయి.
దీంతో అతడి చెయ్యి వేళ్లు విరిగిపోయాయి. తన భార్యకు చిన్న పాటి గాయాలతో బయటపడింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపు జరిగే నష్టం జరిగిపోయింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయమని కోరారు. దీంతో ఆ ప్రాంతంలోని సీసీఫుటేజీని పరిశీలించిన పోలీసులు ముగ్గురు వ్యక్తులు తమ గేదెలను తోలుకుంటూ రావడం గమనించారు.
ఈ ఘటన చూసి పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుకుగా ఉన్న రోడ్డుపై పశువులను తీసుకువచ్చి.. ప్రమాదానికి కారణమయ్యారంటూ వారిని అరెస్టు చేశారు. ప్రమాదంలో గాయపడిన ఆ దంపతులకు నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన వారి పేర్లు రజాక్ , సదాకత్ మరియు నదాఫత్ గా వెల్లడించారు.





























