IND vs ENG Semifinal: టాస్ ఓడిపోతే మ్యాచ్ భారత్‌దే..! గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే..?

0
149

IND vs ENG Semifinal: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో నేడు టీమిండియా కీలక మ్యాచ్ ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కి చేరుకునేందుకు నేడు బలమైన ఇంగ్లండ్ జట్టుతో సెమీ ఫైనల్ ఆడనుంది. బుధవారం పాకిస్తాన్, న్యూజలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ జరగ్గా.. పాకిస్తాన్ గెలిచి ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది. నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న రెండో సెమీ ఫైనల్‌ కోసం క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్, ఇంగ్లండ్ రెండూ బలమైన జట్లు కావడంతో ఈ సమవుజ్జీల పోరులో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది.

తొలి సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్ గెలవడంతో.. రెండో సెమీ ఫైనల్‌లో టీమిండియా గెలవాలని భారత్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇలా జరిగతే ఫైనల్ పోరులో పాకిస్తాన్, టీమిండియా మ్యాచ్ మరింత రంజుగా ఉంటుందని క్రికెట్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన 5 మ్యాచ్‌లలో 4 మ్యాచ్‌లు గెలిచి టీమిండియా సూపర్ ఫామ్‌లో ఉంది. దీంతో బలమైన ఇంగ్లండ్‌ జట్టును ఓడించి ఫైనల్‌కి చేరుకునేందుకు టీమిండియా కసరత్తులు చేస్తోంది. విరాట్ కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉండగా.. గత మ్యాచ్‌తో కేఎల్ రాహుల్ కూడా ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.

ఈ రోజు ఆడిలైట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుండగా.. ఇక్కడ మ్యాచ్ గెలవాలంటే టాస్ ఓడిపోవాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఈ స్టేడియంలో 11 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగ్గా.. టాస్ ఓడిపోయిన జట్లు అన్నీసార్లు గెలిచాయి. టాస్ గెలిచిన జట్టు ఒక్కసారి కూడా గెలిచిన దాఖలు ఇక్కడ లేవు. దీంతో ఆ సెంటిమెంట్‌ను క్రికెట్ ఫ్యాన్స్ బాగా నమ్ముతున్నారు.

IND vs ENG Semifinal:

రోహిత్ వర్మ టాస్‌లు ఎక్కువగా గెలుస్తూ ఉంటాడు. కానీ ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ టాస్ ఓడిపోవాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏ మ్యాచ్‌లో అయినా టాస్ కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఒకలా.. రెండో ఇన్నింగ్స్‌లో మరోలా పిచ్‌లు మారుతూ ఉంటాయి. అందుకే టాస్‌లపై కూడా గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయి.