అలా ఉండటమే అప్పటి ప్రముఖ హాస్య నటుడు రమణారెడ్డికి గొప్ప వరం అయింది.

0
624

అలనాటి చిత్రాలలో నటించి హస్య నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్న నటుల్లో రమణారెడ్డి ఒకరు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ కాలంలో ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రల్లో కడుపుబ్బా నవ్వించి చిత్ర పరిశ్రమలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సాధారణంగా అప్పటి నటుల్లో ఎక్కువశాతం రంగస్థలం నుంచి వచ్చినవారే ఉండేవారు. కానీ రమణారెడ్డి మాత్రం అలా నాటకాలు వేసి ఇండస్ట్రీకొచ్చింది లేదు. ఆయనదో డిఫరెంట్ లైఫ్ స్టైల్. రమణారెడ్డి అసలు పేరు తిక్కవరపు వెంకట రమణారెడ్డి. అక్టోబర్ 1, 1921లో పుట్టారు. బాగా సన్నగా, పొడవుగా ఉండటంతో ఆయన మీద ఎన్నో జోకులు వేసుకునేవారట.

రమణారెడ్డి సినిమాలలో రాక ముందు నెల్లూరులో శానిటరీ ఇన్స్‌పెక్టరుగా ఉద్యోగం చేశారు. అయితే ఆయనకి సినిమాల మీద ఎంతో ఆసక్తి ఉండేది. ఎలాగైనా మంచి నటుడనిపించుకోవాలని చేస్తున్న ఉద్యోగం వదిలేసి సినిమాల కోసమని మద్రాసు చేరుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రమణారెడ్డికి ముందు నుంచి మాజిక్‌ చేయడం అంటే మహా సరదా. సినిమాలలో అవకాశాలు ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా మాజిక్‌ నేర్చుకునేందుకు సమయం
కేటాయించేవారు.

అలా నేర్చుకున్న తర్వాత చాలా చోట్ల ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అంతేకాదు ఆయన కొంతమంది శిష్యుల్ని తయారుచేసేవారు. ఈ క్రమంలోనే ‘సేవాసంఘాల సహాయనిధికి’ కోసం అని ఎవరైనా అడిగితే, నిజంగా ఆ సంస్థ ఎలాంటిది అని అన్నీ రకాలుగా  పరిశీలించి, ఆయనకి సరైనదే అనిపిస్తే పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా మాజిక్‌ ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇక రమణారెడ్డి సినిమాలలోకి రావడానికి సహాయపడింది శంకరరెడ్డి. ‘లవకుశ’ వంటి గొప్ప సినిమాను నిర్మించిన శంకరరెడ్డి ప్రోత్సాహంతోనే రమణారెడ్డి మొదటిసారిగా మాయపిల్ల సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు.

ఈ సినిమాకి రఘపతి వెంకయ్య కొడుకు ప్రకాశ్‌ దర్శకుడు. శంకరరెడ్డి, ప్రకాశ్‌ కలిసి ఈ సినిమాను రూపొందించారు.ఈ సినిమాలో రమణారెడ్డిది మంచి హాస్య పాత్రే అయినప్పటికీ, హిట్ అవకపోడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత నటించిన బంగారుపాప , మిస్సమ్మ సినిమాలతో రమణారెడ్డి ఎలాంటి నటుడో అటు ప్రేక్షకులకీ, ఇటు చిత్ర పరిశ్రమకీ తెలిసింది. ఇక బంగారుబాలలో జలుబు చేసినట్టుగా అంటే ముక్కుగొంతు పెట్టి మాట్లాడినట్టు – మిస్సమ్మలో డేవిడ్‌ పాత్రని చక్కగా పోషించి హాస్య నటుడిగా బాగా పేరు తెచ్చుకున్నారు.  అంతకు ముందు అవకాశాల కోసం తిరుగుతూనే, ఏదో ఒకదాంట్లో అనుభవం వస్తుంది కదా అని డబ్బింగ్‌ చిత్రాల్లో కొందరు నటులకి గాత్రదానం చేశారు.

అయితే ఆయన ఇండస్ట్రీకి కొత్త కావడంతో కొంతమంది ఆయనతో డబ్బింగ్ చెప్పుకుంచుకొని డబ్బులు ఎగ్గొట్టారట. అందుకే ఆయన ‘నిజంగా దానమే చేశాను’ కొంతమంది డబ్బులు ఎగ్గొట్టారు కూడా, అని చెప్పిన సందర్భాలున్నాయట. రమణారెడ్డి బాడీ లాంగ్వేజ్‌తోనే పాత్రలు తయారయ్యేవి. ఆయన యాసతోనే ప్రత్యేకంగా గుర్తింపు సాధించారు. పాత్ర ఎలాంటిదైనా నెల్లూరు యాసతో ఆ పాత్ర హైలెట్ అయ్యేలా నటించేవారు. ‘మాయాబజార్‌’ వంటి సినిమా లోనూ చిన్నమయ పాత్ర కూడా ఆ భాష నుంచి తప్పించుకోలేకపోయింది. ‘నా భాష అది. ఎట్ట తప్పించుకుంటా?’ అన్నారట.

ఇక దర్శకులు కూడా ‘ఆయన చేసే పాత్ర అందులో డైలాగులు తన ట్రెండ్‌లో వుంటేనే బావుంటుంది. అవసరం అనిపిస్తే మార్చకుందాంలే’.. అనేవారట. చాలామంది అనుకుంటే  లావెక్కుతారు. కాని, రమణారెడ్డి ఎప్పుడూ ఒకే పర్సనాలిటీ మెయిన్‌టెయిన్‌ చేశారు. అలా ఉండడమే ఆయనకి గొప్ప వరం. రమణారెడ్డి శరీరం రబ్బరు బొమ్మ తిరిగినట్టు.. చేతులూ, కాళ్లూ కావలసిన రీతిలో ఆడేవి. ఒక్క క్షణంలో కూలిపోవడం, ఠక్కున పడిపోవడం రమణారెడ్డికి సాధ్యమైనట్టు మిగతావాళ్లకి సాధ్యమయ్యేది కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here