కరోనా రోగులు వాసన కోల్పోతే మంచిదేనా..?

0
359

గత కొన్ని నెలల నుంచి కరోనా మహమ్మారి వల్ల భారత్ లోని, తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దేశంలో రోజురోజుకు కరోనా రోగుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు కరోనా మహమ్మారి గురించి ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కరోనా వైరస్ సోకిన వాళ్లు వాసన కోల్పోతే ప్రమాదమని గతంలో కొందరు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

అయితే ఇరాన్‌లోని టెహ్రాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా ఆధ్యయనాలు కరోనా రోగులు వాసన కోల్పోవడం మంచిదేనని చెబుతున్నాయి. ఎవరైతే కరోనా బారిన పడి వాసన కోల్పోతున్నారో వాళ్లు త్వరగా కోలుకుంటున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇజ్రాయెల్ కు చెందిన పరిశోధనల్లో సైతం ఇదే విషయం వెల్లడైంది.

కరోనా సోకిన 207 మందిపై టెహ్రాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. కరోనా రోగులు ఎవరైతే వాసన కోల్పోతారో వారిలో ముక్కుదిబ్బడ, తలనొప్పి, ప్లేట్ లెట్లు తగ్గడం లాంటి సమస్యలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా రోగుల్లో వాసన కోల్పోవడం హఠాత్తుగా జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. 1,60,000 కంటే తక్కువ సంఖ్యలో ప్లేట్ లెట్లు ఉన్నవాళ్లు వాసన కోల్పోతే త్వరగా కోలుకుంటారని వెల్లడిస్తున్నారు.

శరీరంలో వాసనకు సంబంధించిన ఏస్‌ 2 రిసెప్టార్స్‌ పై కరోనా వైరస్ దాడి చేస్తోందని ఫలితంగా కరోనా రోగులు వాసన కోల్పోతున్నారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాసన కోల్పోయిన కరోనా రోగులు సైతం ఇదే విషయాన్ని ధృవీకరించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వాళ్లకు మాత్రం ఆరోగ్య పరిస్థితి విషమించే అవకాశం ఉందని సమాచారం.