హైదరాబాద్: సినీ నటుడు ఫిష్ వెంకట్ (వయసు 53) మృతి వార్త తెలుగు సినీ ఇండస్ట్రీకి షాక్‌ను మిగిల్చింది. గత కొంతకాలంగా మూత్రపిండ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఎప్పుడూ హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటుడు ఇక లేడని వార్త వినగానే అభిమానుల హృదయాలు భరించలేకపోయాయి. అయితే, ఆయన మృతికి సంబంధించి సినీ పరిశ్రమపై కొన్ని విమర్శలు, చర్చలు మొదలయ్యాయి. “ఇండస్ట్రీలో చిన్న నటులు అంటే మరీ ఇంత చిన్న చూపా?” అనే ప్రశ్న ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది.

అనారోగ్యం, చికిత్సకు ఆర్థిక కష్టాలు
సినీ ఇండస్ట్రీకి తనదైన కామెడీ టైమింగ్‌తో వందల సినిమాల్లో నవ్వులు పంచిన ఫిష్ వెంకట్, అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమయ్యాడు. కిడ్నీలు పూర్తిగా ఫెయిలవడంతో డయాలసిస్‌పై ఆధారపడే పరిస్థితికి చేరాడు. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వెంకట్, చివరకు తుదిశ్వాస విడిచాడు. అయితే ఆయన చికిత్స సమయంలో సినీ ప్రముఖుల నుంచి సరైన స్పందన లేకపోవడం బాధ కలిగించే అంశంగా మారింది.
అందిన సహాయం, అందని దాత.. ప్రశ్నార్థకంగా మారిన సినీ ప్రముఖుల పాత్ర
ప్రముఖులు సహాయం చేయలేదన్నది కాదు. మొదట్లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌లు స్పందించి చికిత్స ఖర్చులకు సహాయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ప్రారంభంలో డిప్యూటీ సీఎం హోదాలో ఫిష్ వెంకట్ చికిత్సకు డబ్బు మంజూరు చేసినట్టు తెలిసింది. ప్రభాస్ తరఫు నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని వెంకట్ కుమార్తె వివరించింది. ఆయన టీం మాట్లాడుతూ, కిడ్నీ దాత దొరికితే అవసరమైన ఖర్చులు భరిస్తామని చెప్పారు. కానీ, ప్రధాన సమస్య కిడ్నీ డోనర్ లభ్యం కావడంలోనే ఉండిపోయింది. రూ.50-60 లక్షలు ఉంటే తన తండ్రి బ్రతికేవారని ఆయన కుమార్తె ఆవేదన వ్యక్తం చేసింది.
నెటిజన్ల ఆగ్రహం: “మా” ఎక్కడ? స్టార్స్ ఎక్కడ?
అయితే, వెంకట్ జీవితాన్ని నిలబెట్టే ప్రయత్నం మరింత బలంగా ఉండాల్సిందని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. “రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ మొదట్లో స్పందించినా… చివరిదాకా చొరవ చూపించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో” అనే ప్రశ్నలు నెట్టింట ప్రత్యక్షమవుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్‌కి అపోలో హాస్పిటల్‌తో సంబంధాలుండగా, కిడ్నీ డోనేషన్ విషయంలో మరింత సహకారం అందించవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇంకొంతమంది “సినిమా రంగానికి చెందినవారే… ఇకనైనా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సీరియస్‌గా ఆలోచించాలి” అంటూ అసోసియేషన్‌పై విమర్శలు చేస్తున్నారు. “మంచు విష్ణు ఎక్కడ ఉన్నాడు?” అనే సెటైర్లు కూడా కనిపిస్తున్నాయి.
వాస్తవానికి, ఫిష్ వెంకట్ అనేక కథా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన ప్రత్యేక ముద్ర వేశారు. పెద్దగా న్యూస్‌లో ఉండకపోయినా, పరిశ్రమలో ఎంతో గౌరవించబడే హాస్యనటుల్లో ఆయన ఒకరు. ఆయన చనిపోవడం కంటే, చివరి రోజుల్లో ఆయనకు సరైన సహాయం అందలేదన్న భావన నెటిజన్లలో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. చివరికి, “తమతమ పనుల్లో బిజీ అయిన స్టార్స్‌కి.. ఇలా ఓ సహజ నటుడి పరిస్థితి గుర్తుకు రాలేదా?” అన్న చర్చ ఇప్పుడు తీవ్రంగా నడుస్తోంది. ఈ ఘటన తెలుగు సినీ పరిశ్రమలో చిన్న నటుల పట్ల ఉన్న వైఖరిపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.































