తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఉగాది సంబరాలతో కళకళలాడింది. శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన భార్య వైఎస్ భారతితో కలిసి పాల్గొన్నారు. సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమం పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది.

ఈ సందర్భంగా జగన్ పంచకట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పండుగకు తగిన విధంగా సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనడం అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకుంది. ఉగాది పర్వదినానికి అనుగుణంగా పూజలు నిర్వహించగా, పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని జగన్ దంపతులు శ్రద్ధగా విన్నారు.
వేడుకల్లో పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉగాది సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనందంగా గడిపారు. కార్యాలయం మొత్తం పండుగ వాతావరణంతో నిండిపోయింది.
ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సంప్రదాయ పంచకట్టులో కనిపించిన జగన్ స్టైల్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ద్వారా సంస్కృతిని నిలబెట్టుకోవాలనే సందేశం కూడా ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైంది






























