ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం, వల్ల కొన్ని సార్లు ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి నిర్లక్ష్యం వల్లే ఇది వరకు ఎన్నో ప్రాణాలు కోల్పోయాయి. తాజాగా అలాంటి నిర్లక్ష్యమే మరోసారి బయటపడింది. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఒకరికి చేయాల్సిన ఆపరేషన్ మరొకరికి చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆపరేషన్ చేసే సమయంలో అప్రమత్తమైన మహిళ గట్టిగా కేకలు వేయడంతో తేరుకున్న వైద్య సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అయితే అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మాలతి 7 నెలల గర్భిణీ. అయితే ఆమెకు కడుపులో నొప్పి ఉండటంతో మాలతి వైద్యపరీక్షల కోసం మాతా శిశు సంరక్షణా కేంద్రానికి వచ్చారు. అక్కడ ఆమెకు స్కానింగ్ చేసిన వైద్యులు గర్భంలో ఇద్దరు శిశువులు ఉన్నారని, ఒక శిశువు మాత్రమే బతికే అవకాశాలు ఉండటంతో ఆపరేషన్ ద్వారా ఒక శిశువును తొలగించి గర్భసంచికి కుట్లు వేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం మాలతిని ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లాల్సి ఉంది.
ఆపరేషన్ చేయడానికి అక్కడ వైద్యులు మాలతి కేస్ షీట్ కి బదులుగా మరొక ఒక మహిళ కేస్ షీట్ తీసుకొని ఆపరేషన్ కి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే మాలతిని ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లి ఆమె గర్భసంచికి కుట్లు వేయకుండా ఏకంగా ఆమె కడుపు కోత పెట్టారు. ఇంతలోనే తేరుకున్న మాలతి గట్టిగా కేకలు వేసి అసలు విషయం చెప్పడంతో వెంటనే తేరుకున్న వైద్యులు ఆమెకు కడుపు కుట్లు వేసి మూత్రం పైప్ పెట్టి పంపించారు.
మాలతి ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోతే తల్లీబిడ్డలు ఇద్దరు ప్రాణాలు కోల్పోయే వారని ఆమె బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రి ఎదుట ఆందోళనలు చేపట్టారు.కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని సంబంధిత డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మాలతి భర్త నరోత్తమ్ రెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసాడు….































