తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలు సృష్టించిన భీభత్సం అంతాఇంతా కాదు. వరదల్లో చిక్కుకుని రాష్ట్రంలో పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. గతంలో ఈ స్థాయిలో వర్షాలు ఎప్పుడూ కురవలేదని నగరవాసులు చెబుతున్నారు. భారీ వర్షాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు అత్యవసర, ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మంత్రులు, ఆధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

అధికారుల నివేదిక ప్రకారం రాష్ట్రంలో 50 మంది వరకు చనిపోగా వారిలో గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన వారే 11 మంది ఉన్నారని తెలుస్తోంది. వర్షాలు, వరదల వల్ల 7.35 లక్షల ఎకరాల్లో పంటలు తిన్నాయని.. 2,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలకు సహాయం చేసేందుకు జీహెచ్ఎంసీకి 5 కోట్ల రూపాయలు విడుదల చేయాలని అన్నారు.

పాక్షికంగా ఇళ్లు దెబ్బ తిన్న వాళ్లకు మరమ్మత్తుల కోసం ప్రభుత్వం సాయం అందజేస్తుందని.. పూర్తిగా ఇళ్లు దెబ్బ తింటే మాత్రం కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఆహారం, 3 చొప్పున దుప్పట్లను అందజేస్తామని వెల్లడించారు. సెల్లార్లు, లోతట్టు ప్రాంతాల్లోని నీటిని వీలైనంత త్వరగా తొలగించాలని ఆదేశించారు.

నీళ్లు తొలగించిన తర్వాతే విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం వల్ల ప్రాణ నష్టం జరగదని అన్నారు. అపార్ట్‌మెంట్ నిర్మాణాలకు ఇకపై నూతన నిబంధన అమలులోకి వస్తుందని వరద నీరు సెల్లార్లలో నిల్వ ఉండకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలనే నిబంధన ఉంటుందని పేర్కొన్నారు. ఇళ్లపైన వెళ్లే హై టెన్షన్ విద్యుత్ వైర్లు తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here