ముస్లిం పేషేంట్ చెవిలో ఇస్లామిక్ ప్రార్థన.. హిందూ డాక్టర్ కు నెటిజెన్ల ఫిదా?

0
55

ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి మనుషుల మధ్య బంధాలను విడదీస్తూ బంధం అనే మాటకి అర్థాన్ని మార్చేసింది. అదేవిధంగా మరికొన్నిచోట్ల కొందరిలో దాగి ఉన్న మానవత్వాన్ని పరిమళింప చేస్తోంది. కరోనా కారణం వల్ల ఎంతో మంది పోలీసులు డాక్టర్లు వారిలో ఉన్న సేవా గుణాన్ని మానవత్వాన్ని ఈ క్లిష్ట పరిస్థితులలో చాటుకున్నారు.తాజాగా కేరళకు చెందిన ఓ వైద్యులు కులమతాలకతీతంగా మానవత్వంతో చేసిన ఓ పని పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాలలోకి వెళితే…

కేరళకు చెందిన డాక్టర్ రేఖ కృష్ణన్ అనే వైద్యురాలు హిందూ మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కోవిడ్ బారినపడి చివరి నిమిషాలలో కొట్టుమిట్టాడుతున్న ఓ ముస్లిం బాధితురాలికి తన చెవిలో ఇస్లామిక్ ప్రార్థనలు వినిపించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పాలక్కాడ్ పట్టాంబిలోని సెవానా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్​లో మే 17 న చోటుచేసుకున్న ఈ ఘటన చోటు చేసుకుంది.

బీవతు అనే 56 ఏళ్ల ముస్లిం మహిళ కరోనా బారిన పడటంతో ఆమెను చికిత్స నిమిత్తం సెవానా హాస్పిటల్​లో చేర్చారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం తనని చూడటానికి తన బంధువులకు అనుమతి లేదు. అయితే రోజురోజుకు ఆమె ఆరోగ్య పరిస్థితి దారుణంగా క్షీణించడంతో పాటు అవయవాలు స్పందించడం మానేశాయి.

ఈ క్రమంలోనే సదరు బాధితురాలిని వెంటిలేటర్​పై నుంచి తొలగించాలని నిర్ణయించారు. మరణం అంచులలో కొట్టుమిట్టాడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆమె పరిస్థితి దారుణంగా ఉన్న క్రమంలో అక్కడ డాక్టర్ రేఖ కృష్ణన్ విధులు నిర్వహిస్తున్నారు. ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంటూ కొట్టుమిట్టాడుతున్న ఆమెకు చివరి నిమిషాల్లో కాస్త ఓదార్పును ఇవ్వడం కోసం డాక్టర్ రేఖ ఆమె చెవిలో ఇస్లామిక్ ప్రార్థనలను చదివారు.

ముస్లిం సంప్రదాయం ప్రకారం మరణించే వ్యక్తి చెవిదగ్గర
కలీమా ప్రార్థన పఠిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని ప్రగాఢ విశ్వాసం. అందువల్ల రేఖ కృష్ణన్ బాధితురాలి చెవిలో కలీమా ప్రార్థన చదవడంతో సదరు మహిళ గట్టిగా శ్వాస తీసుకొని ప్రాణాలు వదిలింది. ఈ విషయంపై డాక్టర్ స్పందిస్తూ రోగి చివరి నిమిషాలలో తన కుటుంబ సభ్యులు ఎవరూ పక్కన లేకపోవడంతో ఆమెకు ఏదైనా సహాయం చేయాలనిపించడంతోనే ఈ విధంగా ప్రార్థన చేసినట్లు తెలిపారు. నేను హిందూ మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ యూఏఈలో పెరిగినందున నాకు ముస్లిం ప్రార్థనలు, పద్ధతులు అన్నింటిపై అవగాహన ఉంది. అందుకోసమే ఆమె చివరి ఘడియలలో ఈ విధంగా ప్రార్థనలో చేశానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here