టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి అగస్టు 15 నాటికి సరిగ్గా సంవత్సరం పూర్తి అయింది. ఎంఎస్ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే 2007 టీ20 వరల్డ్ కప్, 2011 లో వన్డే వరల్డ్ కప్ సాధించిన ధోనీకి దేశంలోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. రిటైర్ మెంట్ ప్రకటించినా గానీ ఫ్యాన్స్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు.

తమిళనాడులో అయితే ధోనీకి కోలీవుడ్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉన్నది. ఇక హర్యానాకు చెందిన అజయ్ గిల్ అనే వ్యక్తి ధోనీ అంటే చచ్చిపోతాడు. అంతలా ధోనీపై అభిమానం పెంచుకున్నాడు. అతడికి మొదటి నుంచి ధోనీని కలవాలనే కోరిక బలంగా ఉంది. లాక్‌డౌన్ సమయంలో వెళ్లడం కుదరక పోవడంతో గత నెలలో ధోనీ కోసం ప్రయాణం మొదలు పెట్టాడు. హర్యాణాలోని హిసార్ జిల్లా జలన్ ఖేడా గ్రామానికి చెందిన 18 ఏళ్ల అజయ్ జులై 29న తన గ్రామం నుంచి నడక మొదలు పెట్టాడు.
దాదాపు 16 రోజలు పాటు 1400 కిలోమీటర్లకు పైగా నడిచి చివరకు స్వాతంత్య్ర దినోత్సవం రోజు రాంచీలోని ధోనీ ఇంటికి చేరుకున్నాడు. ఇలా అతడు ధోనీ దగ్గరకు వెళ్తున్నట్లు మార్గ మధ్యలో కొంతమంది తెలుసుకొని అతడికి స్పెషల్ హెయిర్ కట్ చేశాడు. అజయ్ తలపై ధోనీ అనే అక్షరాలు వచ్చేలా హెయిర్ కట్ చేశాడు. అయితే అతడు ధోనీ ఇంటి ముందు నిలబడగా ఓ జాతీయా మీడియా ప్రతినిధి చూసి అతడిని ఆరా తీశాడు. అతడు ధోనీ కోసం వచ్చినట్లు తెలిపాడు.
ఒక్క పది నిమిషాలు ధోనీ బయటకు వస్తే.. కలిసి వెళ్తాను. ప్లీజ్ నా కోసం ధోనీని పిలిపించండంటూ.. వేడుకున్నాడు. అయితే అతడు ఐపీఎల్ ఫేజ్ 2 కోసం యూఏఈ వెళ్లాడని సెక్యూరిటీతో పాటు మీడియా ప్రతినిధి కూడా చెప్పాడు. దీంతో అతడు నిరాశ చెందాడు. అతడు ఒక క్రికెటర్.. ధోనీ టీమిండియాలో చోటు సాధించినప్పుడు మానేసినట్లు తెలిపారు. మళ్లీ ఇప్పుడు ధోనీ ఆశీర్వాదం తీసుకొని మళ్లీ క్రికెట్ ఆడటం ప్రారంభిస్తానని అజయ్ చెప్పుకొచ్చాడు. కానీ 1400 కిలోమీటర్ల కాలినడకన వచ్చిన అజయ్ కోరిక మాత్రం తీరలేదు.



























