అమరావతి: మంత్రి నారా లోకేష్ సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి సింగపూర్ పర్యటన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన లిక్కర్ స్కామ్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంలో జగన్ అరెస్ట్ అవుతారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, లోకేష్ “చట్టం తన పని తాను చేసుకుంటుంది” అని సమాధానమిచ్చారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జగన్‌పై లోకేష్ తీవ్ర విమర్శలు
లోకేష్ మాట్లాడుతూ, “మేమంతా రాష్ట్ర అభివృద్ధి కోసం పరుగు పెడుతుంటే, జగన్ తప్పుడు ఈ-మెయిల్స్ పెడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు ఆ రాష్ట్రానికే పరిమితం అవుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అభివృద్ధిని అడ్డుకునే ‘క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్’ నడుస్తోంది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే వారిని వదిలిపెట్టం, తప్పక చర్యలు తీసుకుంటాం” అని అన్నారు.
లిక్కర్ స్కామ్‌పై ప్రశ్నల వర్షం
లిక్కర్ స్కామ్‌పై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. “ఒక లిక్కర్ కంపెనీ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు చేస్తుందా? లిక్కర్ కంపెనీకి బంగారం ఏమన్నా ముడి సరుకా? అదాన్ డిస్టిలరీ నుంచి పీఎల్ఆర్ కంపెనీకి డబ్బులు ఎందుకు వెళ్లాయి? దీనికి పెద్దిరెడ్డి సమాధానం చెప్పగలరా?” అని సవాల్ విసిరారు.
తల్లి, చెల్లికి అన్యాయం చేసిన వ్యక్తి నాయకుడిగా పనికిరారు
జగన్‌పై లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. “ఎమర్జెన్సీ వాతావరణం ఉందని చెబుతున్నారు. నిజంగా ఉంటే జగన్ బయటకు రావచ్చా? ఆయన హయాంలో చంద్రబాబు ఇంటి గేటుకు తాళాలు వేసి కట్టలేదా? తల్లి, చెల్లిపై కేసులు పెట్టి, ఆ కేసులో గెలిచామని సంబరాలు చేసుకోవడం జగన్‌కే సాధ్యం. తల్లి, చెల్లికి అన్యాయం చేసే వ్యక్తి అసలు నాయకుడిగా పనికివస్తారా?” అని ప్రశ్నించారు.
అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం
చివరగా లోకేష్ మాట్లాడుతూ, “జగన్ అభివృద్ధి చేయరు. చేసేవాళ్లను మాత్రమే అడ్డుకుంటారు. ఆయన వేసిన పాచికలు ఎక్కడా పడడం లేదు” అని వ్యాఖ్యానించారు. లోకేష్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
































