కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రైతులు ఏకంగా లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని మోదీ సర్కార్ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అగ్రి హ్యాకథన్ పేరుతో నూతన కార్యక్రమాన్ని లాంఛ్ చేసింది. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో కేంద్రం శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ఆవిష్కరించారు.

దాదాపు 60 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుండగా 24 మంది విజేతలు ఈ స్కీమ్ ద్వారా లక్ష రూపాయలు గెలుపొందే అవకాశం ఉంటుంది. విజేతలకు నగదుతో పాటు రైతులకు ప్రయోజనం చేకూర్చే ఉత్పత్తుల తయారీ కోసం కేంద్రం నుంచి ఆర్థిక మద్దతు లభిస్తుంది. ఈ కార్యక్రమం వర్చువల్ కార్యక్రమం కాగా ఇండియన్ అగ్రికల్చర్ విభాగంలో జరుగుతున్న పెద్ద కార్యక్రమం ఇదే కావడం గమనార్హం.
ఆసక్తి ఉన్న రైతులు అగ్రి హ్యాకథాన్ 2020లో పాల్గొనవచ్చు. దేశంలోని వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ సమస్యలకు పరిష్కారం చెప్పడంతో పాటు ప్రస్తుతం రైతులు పొందుతున్న సేవలతో పోలిస్తే మెరుగైన సేవలను పొందడానికి అవసరమైన ఉత్పత్తులను తయారు చేసిన వాళ్లు, రైతుల శ్రమను తగ్గించే ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చేవారు అగ్రి హ్యాకథాన్ 2020లో పాల్గొనవచ్చు.
రైతులతో పాటు స్మార్ట్ ఇన్నోవేటర్లు, స్టార్టప్స్, యువత కూడా అగ్రి హ్యాకథాన్ 2020లో పాల్గొనవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా mygov.in వెబ్ సైట్ ద్వారా రైతులు రిజిష్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని రైతులు ప్రశంసిస్తున్నారు.

































