ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్యన్ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ఆర్యన్ డ్రగ్స్ కేసు విషయంలో రోజుకో వార్త తెలుస్తూ ఉండటంతో ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. క్రూజర్ షిప్ రేవ్ పార్టీలో ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణల కారణంతో ఎన్‌సీబీ అధికారులకు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేశారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎన్‌సీబీ అధికారుల కస్టడీలో ఉన్నటువంటి ఆర్యన్ ఖాన్ ను పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. అయితే ఆర్యన్ ను విడిపించడం కోసం షారుక్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కోర్టు మాత్రం అతని బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఆర్యన్ కేసు గురించి మరొక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఎన్‌సీబీ కస్టడీలో ఉన్నటువంటి ఆర్యన్ బయటకు రావాలంటే అధికారులు ఏకంగా 25 కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభాకర్ సాయీల్ అనే ప్రత్యక్ష సాక్షి ఆరోపణలు చేశాడు. అదే విధంగా 25 కోట్లలో ఎనిమిది కోట్ల రూపాయలు ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు ఇవ్వాలని అధికారులు మాట్లాడుకోవడం తాను విన్నానని ఈ సందర్భంగా ప్రభాకర్ బయటపెట్టారు.
ఎన్‌సీబీ అధికారులు క్రూయిజర్ షిప్ పై దాడి చేసిన సమయంలో ప్రత్యక్ష సాక్షులుగా ప్రభాకర్,గోసావి అనే వ్యక్తితో పాటు మరి కొందరు పేర్లు సాక్షులుగా ఉన్నారు. ఇలా ఆర్యన్ ను అరెస్టు చేసిన తర్వాత శామ్ డిసౌజా అనే వ్యక్తితో గోసావికి ఫోన్ చేసి 25 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరు షారుఖాన్ మేనేజర్ తో సంప్రదింపులు జరిపి చివరికి 18 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.
అయితే ఈ విషయం బయట తెలిసిన తర్వాత గూసావి కనిపించడం లేదని, అందుకే ప్రాణభయంతో తను ఈ విషయాలన్నింటిని బయట పెడుతున్నట్లు ప్రభాకర్ తెలిపారు. ఈ విషయంపై అధికారులు స్పందిస్తూ కేసును తప్పుదోవ పట్టించడానికి అలాగే మా సంస్థ పరువును అప్రతిష్ట పాలు చేయడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తెలిపారు. ఆర్యన్ బెయిలు పిటిషన్ పై మరోసారి కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు రావడంతో ఈ విషయం గురించి మరింత ఉత్కంఠ ఏర్పడింది.






























