ప్రపంచ దేశాలన్నింటికీ పై కరోనా మహమ్మారి వివిధ రూపాలలోకి పరివర్తన చెందుతూ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే భారతదేశంలో వ్యాప్తి చెందిన రెండవ దశ వేరియంట్ ఎంతటి నష్టాన్ని కలుగజేసిందో మనకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ ప్రభావం నుంచి ఇండియా కోలుకుంటుంది. ఇదిలా ఉండగా రష్యాలో కరోనా వైరస్ మరోసారి రూపాంతరం చెందినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

రష్యాలోని గమలేయా నేషనల్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు కొత్త స్ట్రెయిన్ వైరస్‌ను కనుగొన్నట్లు తెలియజేశారు. అయితే ఈ వైరస్ రష్యాలోని మాస్కోలో గుర్తించడంతో ఈ వైరస్ ను ఆ నగరం పేరుతోనే పిలుస్తున్నట్లు తెలిపారు.రష్యాలో రోజురోజుకు కేసులు పెరుగుతున్న క్రమంలో శాస్త్రవేత్తలు ఈ విధమైనటువంటి పరిశోధనలు నిర్వహించగా వారు ఈ రకం కొత్త వైరస్ ను గుర్తించినట్లు తెలిపారు.
కొత్తగా ఏర్పడిన ఈ వైరస్ పై స్పుత్నిక్ వి ఎంత వరకు పనిచేస్తుంది అనే విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ కొత్త స్ట్రెయిన్ వైరస్ పై స్పుత్నిక్ సమర్థవంతంగా పని చేస్తుందనే నమ్మకం ఉందని గమలేయా నేషనల్ సెంటర్ హెడ్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రోజురోజుకు రష్యాలో విపరీతంగా కేసులు పెరుగుతుండడంతో పాటు ఈ విధంగా కొత్తరకం వైరస్ రూపాంతరం చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఒక్కరోజులోనే రష్యాలో 13.397 కరోనా కేసులు నమోదవగా వీటిలో 5,782 కేసులు మాస్కోలోనే నమోదయ్యాయి. అయితే కొత్తగా రూపాంతరం చెందిన వైరస్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, సరైన జాగ్రత్తలు పాటిస్తూ, వ్యాక్సిన్ తీసుకోవడంతో ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు తెలియజేస్తున్నారు.































