సాధారణంగా బైక్ పై వెళ్లే వాహనదారులు లైసెన్స్, ఇతర డాక్యుమెంట్లు మరిచిపోయినా నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడిపినా చేసిన తప్పును బట్టి 100 రూపాయల నుంచి వేల రూపాయలు జరిమానా విధిస్తారు. అయితే ఒక వ్యక్తికి మాత్రం ఏకంగా లక్షల్లో ఫైన్ వేశారు. ఆ వ్యక్తి బైక్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల అంత భారీ మొత్తంలో జరిమానా విధించారని సమాచారం.

ఒడిశా రాష్ట్రంలోని రాయగడలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే ప్రకాశ్ అనే వ్యక్తి తన బైక్ కు ప్లాస్టిక్ డ్రమ్ములను కట్టుకొని ఊరూరా తిరుగుతూ అమ్మేవాడు. అయితే అతను తిరుగుతున్న వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించలేదు. రాయగడ పోలీసులు తనిఖీల్లో భాగంగా అతని వాహనాన్ని ఆపి బైక్ కు సంబంధించిన పత్రాలను అడిగారు.

అయితే ఆ వ్యక్తి దగ్గర బండికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పాటు బైక్ కు రిజిస్ట్రేషన్ కూడా లేదు. దీంతో పోలీసులు ఏకంగా 1,13,000 రూపాయలు ఫైన్ విధించారు. భారీ మొత్తంలో ఫైన్ విధించడంతో అవాక్కైన ప్రకాష్ ఏం చేయాలో పాలుపోక చివరకు స్నేహితులు, బంధువుల దగ్గర డబ్బులను అప్పు చేసి ఫైన్ ను చెల్లించాడు. కొత్త బైక్ కు సమానమైన మొత్తాన్ని ఆ వ్యక్తి జరిమానా చెల్లించడం గమనార్హం.

అయితే పోలీసులు భారీ మొత్తంలో జరిమానా విధించడాన్ని కొందరు సమర్థిస్తుంటే మరి కొందరు మాత్రం తప్పుబడుతున్నారు. వీధివ్యాపారులకు భారీ మొత్తంలో ఫైన్ వేయడం సరికాదని కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు నెటిజన్లు వీధి వ్యాపారి ఫైన్ చెల్లించకుండా కొత్త బైక్ కొనుగోలు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here