ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు. మరికొందరు ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు వంటి ఇతర బలమైన కారణాలతో జీవితంపై విరక్తితో బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. కానీ ఇక్కడ ఓ యువకుడు ఏ కారణంచేత ఆత్మహత్య చేసుకున్నాడో తెలిస్తే.. షాక్ అవుతారు. కేవలం కోడి గుడ్డు దోశకు డబ్బులు ఇవ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాకాల మండలం తలారివారిపల్లికి చెందిన సాయి కిరణ్(21) కొత్తకోట సమీపంలోని వేము ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. అతడికి చిన్న తనంలోనే తన తండ్రి చనిపోయాడు. దీంతో తన తల్లి వద్దే పెరిగాడు. ఒక్కడే కొడుకు కాబట్టి ఆమె కూడా అతడిని ఎంతో గారాబంగా పెంచింది.
చదువులో కూడా అందరికంటే ముందుండేవాడు. అయితే అతడు తన తల్లిని కోడి గుడ్డు దోశ తినాలని ఉంది.. డబ్బులు ఇవ్వమని అడిగాడు. డబ్బులు ఇవ్వక పోవడంతో మనస్తాపానికి గురైన సాయికిరణ్ ఇంట్లో గోడవ పడి తన మొబైల్ ఫోన్‌ను ఇంటిలోనే వదిలి పెట్టి బయటకు వెళ్ళారు. కోపంతో బయటకు వెళ్తున్నాడు.. మళ్లీ వస్తాడులే అని ఆమె అనుకుంది.
కానీ అక్కడ జరిగింది వేరు. అతడు అలాగే నడుచుకుంటూ వెళ్లి గ్రామ సమీపంలోని గుర్రప్పకుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ అతడిని కాపాడేందుకు కూలీలు ఎంతగానో ప్రయత్నించారు. కానీ అతడు అప్పటికే మృతి చెంది ఉండడంతో పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.






























