Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోలు మధ్య మనస్పర్ధలు రావడం సర్వసాధారణం. అయితే మనస్పర్ధలు వచ్చినప్పటికీ తిరిగి ఏదైనా సందర్భంలో వాళ్ళు కలిసినప్పుడు ఆ మనస్పర్ధలు పక్కనపెట్టి ఎంతో సరదాగా మాట్లాడుకోవడం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది.ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి మంచు కుటుంబానికి మధ్య మనస్పర్ధలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. నిత్యం ఈ రెండు కుటుంబాల మధ్య ఏదో ఒక విషయం గురించి కోల్డ్ వార్ జరుగుతుంది.

ఇకపోతే మా ఎన్నికల సమయంలో ఈ రెండు కుటుంబాల మధ్య దూరం మరికాస్త పెరిగిందనే చెప్పాలి. మా ఎన్నికల సమయంలో ఒకరిపై మరొకరు పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుపుకున్నారు. ఈ ఎన్నికల తర్వాత మంచు కుటుంబం మెగా కుటుంబం ఎక్కడ ఎదురు పడిన సందర్భాలు లేవు. తాజాగా సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్యను హీరోయిన్ గా పరిచయం చేస్తూ విశ్వక్సేన్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ సినిమా పూజా కార్యక్రమాలను హైదరాబాదులో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పవన్ కళ్యాణ్ రాగా, మంచు విష్ణు సైతం ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ క్రమంలోనే వేదికపై కలుసుకున్న ఈ ఇద్దరు హీరోలు ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
క్లాప్ కొట్టి సినిమా ప్రారంభించిన పవన్ కళ్యాణ్..
ఇక అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ ఐశ్వర్య జంటగా నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలలో భాగంగా పవన్ కళ్యాణ్ హీరోహీరోయిన్లపై క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాను శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ తెరకెక్కిస్తోంది. కేజీఎఫ్ చిత్రాల సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం పవన్ ,విష్ణు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.































