మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత సమస్యలు ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. పీరియడ్స్‌లో మార్పులు, అకస్మాత్తుగా బరువు పెరగడం, అలసట, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పెరిగినప్పుడు ఈ సమస్యలు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది నేరుగా సప్లిమెంట్స్‌పై ఆధారపడటం వల్ల పరిస్థితి మరింత క్లిష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు.

నిపుణుల ప్రకారం హార్మోన్ల సమతుల్యత కోసం ముందుగా జీర్ణవ్యవస్థ, కాలేయం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో అధికంగా ఉన్న ఈస్ట్రోజెన్‌ను బయటకు పంపే బాధ్యత ప్రధానంగా లివర్‌పైనే ఉంటుంది. లివర్ సరిగా పనిచేయకపోతే ఆ హార్మోన్ మళ్లీ శరీరంలోనే చేరి సమస్యలు పెరుగుతాయి. అలాగే గట్ హెల్త్ బాగోలేకపోతే వ్యర్థాలు సరిగా బయటకు వెళ్లవు. దీని ప్రభావం హార్మోన్లపై పడుతుంది.
రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండ్లు, ఆకుకూరలు, అవిసె గింజలు, మెంతులు వంటి ఆహారాలు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. పెరుగు, ఇంట్లో తయారుచేసిన ఫెర్మెంటెడ్ ఫుడ్స్ కూడా గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. గుడ్లు, వెల్లుల్లి, ఉల్లిపాయ, మష్రూమ్స్ వంటి ఆహారాలు లివర్ పనితీరుకు సహాయపడతాయి.
అలాగే మలబద్ధకం సమస్యను నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యర్థాలు శరీరంలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఈస్ట్రోజెన్ మళ్లీ రక్తంలో కలిసే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అవసరమైతే వైద్యుల సూచనతో మాత్రమే సప్లిమెంట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. హార్మోన్ల సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలకంటే జీవనశైలి మార్పులే మంచి ఫలితాలు ఇస్తాయని నిపుణుల అభిప్రాయం.































