దేశంలో కోట్ల సంఖ్యలో బ్యాంకు ఖాతాదారులు డెబిట్ కార్డులను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సైబర్ మోసగాళ్లు ఈ మధ్య కాలంలో డెబిట్ కార్డుల ద్వారా ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ డెబిట్ కార్డులకు సంబంధించి కీలక సూచనలు చేసింది.

పీఓఏస్ మిషన్ లేదా ఏటీఎంలలో లావాదేవీలు జరిపే సమయంలో కీప్యాడ్ ను చేతితో మూసివేయాలని ఎస్బీఐ సూచించింది. ఏటీఎం డెబిట్ కార్డ్, పిన్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పవద్దని కోరింది. ఏటీఎం కార్డుపై ఏటీఎం పిన్ కు సంబంధించిన వివరాలను రాయవద్దని తెలిపింది. ఏటీఎంలలో వెనుక నిల్చొన్న వ్యక్తి ఏటీఎం పిన్ ను చూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఏటీఎంలో లావాదేవీలను ప్రారంభించడానికి ముందు సీసీ కెమెరాలను పరిశీలించాలని తెలిపింది.

పుట్టిన రోజు, ఫోన్ నంబర్, వరుస నంబర్లను ఏటీఎం పిన్ గా పెట్టుకోకూడదని పేర్కొంది. ఈ జాగ్రత్తలతో పాటు కస్టమర్లు లావాదేవీ రశీదులను ఏటీఎం కేంద్రంలోనే పారవేయకుండా ఉంటే మంచిది. కార్డు వివరాలు, పిన్ నంబర్ అడుగుతున్న ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు. మరోవైపు ఎస్బీఐ ఓటీపీ ఆధారిత నగదు లావాదేవీలను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. జనవరి నెల 1వ తేదీ నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

ఓటీపీ ఆధారిత లావాదేవీల వల్ల ఎస్బీఐ డెబిట్ కార్డ్ యూజర్లు నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎస్బీఐ ఖాతాదారులను మోసాల నుంచి రక్షించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here