1978 మెగాస్టార్ చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసిన సంవత్సరం. ప్రముఖ దర్శక నిర్మాత క్రాంతికుమార్ ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేసిన క్రాంతి కుమార్. ఆయన తిరిగి చిరంజీవితో మరొక సినిమాను రూపొందించడానికి సంసిద్ధులు అయ్యారు. క్రాంతి కుమార్ నిర్మాణ సారథ్యం, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘న్యాయం కావాలి’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో రాధిక, చిరంజీవి హీరో, హీరోయిన్లుగా నటించారు.

చిరంజీవి- కోదండరామిరెడ్డి, చిరంజీవి-రాధిక ఇలా అందరూ కూడా మొదటి కలయిక. ఈ సినిమాతో ప్రారంభమైన చిరంజీవి, రాధిక కాంబో.. 1990 వరకు నిరాటంకంగా కొనసాగింది. న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, పట్నం వచ్చిన పతివ్రతలు, ప్రేమ పిచ్చోళ్ళు, శివుడు శివుడు శివుడు, పులి బెబ్బులి, అభిలాష, గూడచారి నెంబర్ వన్, ఊరికి మొనగాడు, ప్రియ, ఇది పెళ్లంటారా, జ్వాల, మొండిఘటం, యమకింకరుడు, హీరో, దొంగ మొగుడు, రాజవిక్రమార్క లాంటి ఎన్నో చిత్రాల్లో చిరంజీవి రాధిక కలిసి నటించారు. ఆ రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన న్యాయం కావాలి, అభిలాష చిత్రాలలో ఒకటి ఫ్యామిలీ ఆడియన్స్ ను దగ్గర చేయగా.. మరొక చిత్రం యూత్ ను అట్రాక్ట్ చేయడం జరిగింది.

అయితే ఎన్టీ రామారావు రాధికతో “వయ్యారి భామలు వగలమారి భర్తలు” సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ ఆమెతో నేరుగా జోడి కట్టలేదు. ఆ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా శ్రీదేవి నటించారు…అక్కినేని నాగేశ్వరరావు రాధికతో అనుబంధం, ఇల్లాలే దేవత సినిమాలో నటించారు… శోభన్ బాబు రాధికతో కార్తీక పౌర్ణమి, బంధం, ఉమ్మడి మొగుడు చిత్రాల్లో నటించారు… సూపర్ స్టార్ కృష్ణ రాధికతో శాంతి నివాసం సినిమాలో నటించారు. రాధిక చెల్లెలు నిరోషతో కృష్ట “పచ్చని సంసారం” చిత్రంలో నటించినప్పటికీ ఆమెకు జోడీగా చేయలేదు.

1988 మణిరత్నం దర్శకత్వం వహించిన ఓ తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైన నిరోష మహాజనానికి మరదలు పిల్ల, బుజ్జిగాడు బాబాయ్, నారి నారి నడుమ మురారి, మధురానగరిలో, అతిరథుడు, అసాధ్యులు, కొబ్బరి బొండం, భలే ఖైదీలు, వన్ బై టూ లాంటి చిత్రాల్లో నటించారు. ఇకపోతే చిరంజీవి రాధికతో దాదాపు పది సంవత్సరాలు అనేక చిత్రాల్లో జోడిగా నటించారు. 1991 క్రియేటివ్ కమర్షియల్స్, కె.ఎస్.రామారావు నిర్మాణం, యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో ‘ స్టువర్టుపురం పోలీస్ స్టేషన్’ విడుదలయింది. ఈ సినిమాలో చిరంజీవి విజయశాంతి, నిరోషా హీరో హీరోయిన్లుగా నటించారు. రాధిక, నిరోషా అక్క చెల్లెల్లతో పాటుగా… ప్రముఖ కథానాయిక లైన నగ్మా, జ్యోతిక, రోషిని ఈ అక్క చెల్లెల్లతో నటించిన ఏకైక తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి కావడం మరో విశేషం.