తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. ఇతడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా పాటల, జానపద పాటల గాయకుడు. అతడు రచయిత కూడా. తెలంగాణ యాసలో మగజాతి అనే జానపద పాటతో యూట్యూబ్ లో ప్రాచూర్యం పొందిన రాహుల్.. 2009లో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజ్ బుల్లోడ పాటతో సినిమారంగంలోకి ప్రవేశించాడు.

ఆ తరువాత దమ్ము సినిమాలో ‘వాస్తు బాగుందే’, రచ్చ సినిమాలో ’సింగరేణి ఉంది’, ఛల్ మోహన రంగా సినిమాలో ‘పెద్దపులి’ వంటి పాటలతో గుర్తింపు పొందాడు. ఇలా అతడు ఎన్నో సినిమాలకు పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చకున్నాడు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో ‘నాటు నాటు నాటు సాంగ్’ తో మళ్లీ వెలుగులోకి వచ్చాడు.
ఆ పాట హిట్ కావడంతో ఇటీవల రాహుల్ మళ్లీ మీడియా ముందు ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇక అతడు ముంబాయ్ వీధుల వెంట తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. అదేంటి అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ముంబాయ్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో భాగంగా రాహుల్ కూడా ముంబయ్ వెళ్లాడు.
అక్కడ ఓ ఆటోను నడపుతూ.. ఉత్సాహంతో డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఆటో డ్రైవర్ గా మారిన రాహుల్.. ఆటో నడిపే వారి విషయంలో గౌరవం పెరిగిందని.. తాను చాలా విషయాలు నేర్చుకున్నాను అంటూ ఓ వీడియో ను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై ఓ నెటిజన్ ‘చిచ్చా.. సైడ్ బిజినెస్ బాగుందంటూ’ సరదాగా కమెంట్ చేశాడు.































