హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీర రాజమౌళి కలయికలో రూపొందుతున్న ప్యాన్-వరల్డ్ మూవీ ‘SSMB29’కి ప్రస్తుతం చిన్న బ్రేక్ పడింది. ఇటీవల ఒక పాటకు సంబంధించిన డాన్స్ రిహార్సల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విరామంలో రాజమౌళి ‘బాహుబలి: ది ఎపిక్’ పనులతో పాటు, ఒక అత్యంత కీలకమైన డీల్‌లో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఇది తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

ప్రస్తుతం శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కె.ఎల్. నారాయణ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. బడ్జెట్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, ఒక ముఖ్యమైన అడ్డంకిని అధిగమించేందుకు సీరియస్‌గా కసరత్తు జరుగుతోందట.
ఆస్కార్ లక్ష్యంగా హాలీవుడ్ టైఅప్?
రాజమౌళి ఎంత గొప్పగా సినిమా తీసినా, ఆస్కార్‌కు నామినేషన్లు వేసినప్పుడు ‘ఫారిన్ కేటగిరీ’లోనే అప్లై చేయాల్సి వస్తోంది. దీంతో అవార్డులు గెలుచుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు, ‘ఆర్ఆర్ఆర్’కు ఇంకో రెండు మూడు అవార్డులు వచ్చేవి. ఈ సమస్యను అధిగమించడానికి, ఇప్పుడు ‘SSMB29’ని ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీతో టైఅప్ చేసి, వారిని ప్రధాన నిర్మాతలుగా ముందుకు తీసుకురావాలని రాజమౌళి టీమ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ అయితే, అప్పుడు సినిమాకు నేరుగా ‘ఇంగ్లీష్ మూవీ’గా ఆస్కార్ అర్హత లభిస్తుంది. కాకపోతే, ఆ వెర్షన్‌ను కూడా స్ట్రెయిట్‌గా షూట్ చేయాల్సి ఉంటుంది. ఇది పెద్ద ఇబ్బంది కాదని, ప్రస్తుతం ఆ విధంగా కొలాబొరేషన్ కోసం ఆసక్తి చూపిస్తున్న హాలీవుడ్ కంపెనీల స్థితిగతుల మీద అధ్యయనం జరుగుతున్నట్టు సమాచారం.
ఎస్.ఎస్. కార్తికేయ పాత్ర, విడుదల లక్ష్యం
ఈ అంశం మీద ప్రస్తుతం డిస్కషన్లు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. షూటింగ్ ప్రారంభానికి ముందే పలు ఇంటర్నేషనల్ సంస్థలు పార్ట్‌నర్‌షిప్ కోసం సంప్రదింపులు జరిపినా, రాజమౌళి అప్పట్లో నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌ను సెకండరీ బ్యానర్‌గా మార్చి, మెయిన్ హౌస్‌గా హాలీవుడ్ కంపెనీని పెడితే, వివిధ విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు అవకాశం పెరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ చూసుకుంటున్నాడని తెలిసింది.
2027లో సినిమా విడుదల చేయాలని రాజమౌళి లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే సంవత్సరం వేసవిలో నిర్మాణాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్‌డేట్ వస్తుందేమో చూడాలి.



























