ప్రస్తుత కాలంలో డిజిటల్ మార్కెటింగ్ పెరిగిన తరువాత ఆన్ లైన్ ద్వారా డబ్బులు చెల్లించడం మామూలైపోయింది. ప్రస్తుత కాలంలో కరెంట్ బిల్లు, రీఛార్జ్, ఏ వస్తువు కొన్నా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయటం అలవాటైపోయింది.ఈ విధంగా ఆన్లైన్ లో డబ్బులు పంపించేటప్పుడు కొందరు ఎన్నో పొరపాట్లు చేస్తుంటారు. ఈ పొరపాట్ల వల్ల వారు ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. అందుకోసమే డబ్బులు పంపించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి.

ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితులలో ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు మరింత ఎక్కువయ్యాయి.డిజిటల్ బ్యాంకింగ్ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించిన ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. పొరపాటున కూడా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ లాంటివి ఇతరులకు తెలిసాయంటే మీ అకౌంట్ ఖాళీ కావడం ఖాయం.
ఆన్లైన్ ద్వారా డబ్బులను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బ్యాంకుకు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసుకోకూడదు. ఇతరులకు ఎస్ఎంఎస్ ద్వారా పంపకూడదు. అదే విధంగా ఈ విషయాలను ఇతరులకు తెలిసే విధంగా రాసి పెట్టుకోకూడదు.కేవలం యూజర్ ఐడి పాస్వర్డ్ మాత్రమే కాకుండా డెబిట్ ,క్రెడిట్ కార్డుల పిన్ నెంబర్ కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి.
ఆన్లైన్ బ్యాంకింగ్ లాగిన్ అయిన తర్వాత మన పని పూర్తి కాగానే అలాగే వదిలేయకుండా వెంటనే లాగౌట్ కావాలి. అప్పుడే మన అకౌంట్ లో ఉన్న డబ్బుకు ఎంతో భద్రత కలిగిఉంటుంది. కొన్నిసార్లు ఫలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి మన ఖాతా వివరాలు అడుగుతారు. ఎట్టి పరిస్థితులలో కూడా మన బ్యాంక్ డీటెయిల్స్ చెప్పకూడదు.బ్యాంకు నుంచి పంపినట్టు మొబైల్ ఫోన్ కి ఏవైనా లింక్స్ వస్తే పొరపాటున కూడా ఆ లింకు ఓపెన్ చేయకూడదు. ఈ విధంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటిస్తే మన డబ్బు ఎంతో జాగ్రత్తగా ఉంటుంది.
































