తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ తన తల్లిదండ్రులపై పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టడం కోలివుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ విషయం తెలిసిన సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. సొంత తల్లిదండ్రులపై కేసు పెట్టడం ఏంటని.. గుసుగుసలు వినిపించాయి. ఎలాంటి అనుమతి లేకుండా తన పేరును వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారంటూ విజయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతే కాకుండా అతడు గత ఎన్నికల సమయంలో తండ్రిపై కేసు పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏడాది క్రితం విజయ్ పేరుతో ‘విజయ్ మక్కల్ ఇయ్యకమ్’ పార్టీ పెట్టారు. దీనికి తన తండ్రి చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీగా, భార్య శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని ఇప్పటికే పలు మార్లు మీడియాకు వెల్లడించారు హీరో విజయ్.

అభిమాన సంఘాలు కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యకలాపాల్లో పాలుపంచుకోవద్దని కోరారు. గతంలో కూడా తన తండ్రిపై కేసు పెట్టాడు. ప్రస్తుతం తన ప్రమేయం లేకుండా.. పార్టీ వ్యవహారాల్లో తన ఫొటోను వాడుకుంటున్నారని, అభిమాన సంఘాలను కూడా భాగం చేస్తున్నారని విజయ్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులతో పాటు పార్టీ ముఖ్యనేతలుగా భావిస్తున్న మరో పదకొండు మందిపై విజయ్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది.

తన పేరు మీద లేదా అతడి అభిమాన సంఘం పేరును ఉపయోగించకుండా నిరోధించాలని కోరుతూ చెన్నై సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కేసును ఈ నెల 27కు వాయిదా వేసింది. తమిళనాట అత్యంత ప్రాచుర్యం కలిగిన కథానాయకుడు విజయ్ సొంత తల్లిదండ్రులపై కోర్టుకెక్కడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. స్థానిక ఎన్నికల్లో తన అభిమాన సంఘం ‘విజయ్ పీపుల్స్ మూవ్ మెంట్’ స్వతంత్రంగా పోటీచేస్తుందని ఆయన తెలిపారు.



























